ప్రతీకాత్మక చిత్రం
ఒక షాపింగ్ మాల్‌లో “ఉచితంగా టేస్ట్ చేయండి” అని బిస్కెట్ స్టాల్ ఉంటే.. వచ్చిపోయేవాళ్లు ఆపుకోగలరా?. ఆన్‌లైన్‌లో “ఉచిత ట్రయల్” అని కనిపిస్తే, వెంటనే క్లిక్ చేయకుండా ఉండగలరా?. అలాగే.. సోషల్ మీడియాలో “ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి” అని కనిపిస్తే, షేర్ చేయడం మొదలవుతుంది కదా. ఫ్రీకి ఉన్న పవర్ అలాంటిది. అది మన ఆలోచనలపై ప్రభావం చూపుతుంది.. ఆకర్షణను పెంచుతుంది.. ఆచరణకు దారి తీస్తుంది. అలా..
ఫ్రీగా నాటుకోళ్లు దొరుకుతుంటే జనం ఊరుకుంటారా?.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో గుర్తుతెలియని వ్యక్తులు వందల సంఖ్యలో కోళ్లను పొలాల వెంట వదిలివెళ్లారు. దీంతో సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారి వెంట జనాలు ఎగబడిపోయారు. కొందరు ఒకటి, రెండు పట్టుకుని పోతే.. మరికొందరు అందినకాడికి సంచుల్లో వేసుకుని ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ సమాచారం అందుకున్న అధికారులు రంగంలోకి దిగారు.
కొన్ని కోళ్లను పట్టుకుని పశువైద్యాధికారుల వద్దకు తీసుకెళ్లారు. అయితే ప్రాథమికంగా ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదట. దీంతో వాటిని మరిన్ని పరీక్షల కోసం ల్యాబ్‌లకు తరలించారు. ఈ క్రమంలో రేపు ఆదివారం కావడంతో జనాలు ఆ కోళ్లను తినే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆరోగ్య రిత్యా ప్రజలు వాటిని తినకుండా ఉండాలని పశువైద్యాధికారులు సూచిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇంత పెద్దఎత్తున నాటు కోళ్లను ఎవరు, ఎందుకు వదిలిపెట్టారో ఇప్పటికీ తెలియ రాలేదు. మీడియా, సోషల్‌మీడియా ప్రచారంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఈ మిస్టరీని చేధించే పనిలో ఉన్నట్లు సమాచారం.


