గోదావరి–కావేరి అనుసంధానంపై కమిటీ సమావేశంలో తెలంగాణ
ఏకాభిప్రాయం సాధించాకే ‘గోదావరి–కావేరి’పనులు: కేంద్ర మంత్రి పాటిల్
నదీ పరీవాహక రాష్ట్రాలసీఎంలతో త్వరలో సమావేశం అవుతామని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి అనుసంధానంపై నదీ పరివాహక ప్రాంతాల (బేసిన్)లోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జలశాఖ మంత్రి సీఆర్ పాటిల్ చెప్పారు. ఏకాభిప్రాయం సాధించాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన నదుల అనుసంధానంపై ఏర్పాటైన ప్రత్యేక కమిటీ సమావేశమైంది.
ఈ సమావేశంతోపాటే నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) 39వ సాధారణ సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి గోదావరి–కావేరి నదుల అనుసంధానం చేపట్టాలని.. అందులో భాగంగా పోలవరం–బనకచర్ల–సోమశీల–కావేరి అనుసంధాన ప్రాజెక్టు చేపట్టాలని ఈ సమావేశంలో ఏపీ చేసిన ప్రతిపాదనపై తెలంగాణ అంతర్రాష్ట్ర జల వ్యవహారాల సీఈ కె. ప్రసాద్ తీవ్ర అభ్యంతరం తెలిపారు.
ఈ ప్రాజెక్టుతో కేవలం ఏపీ, తమిళనాడుకే ప్రయోజనం కలుగుతుందని.. మరోవైపు గోదావరి–కావేరి అనుసంధానాన్ని జాతీయ దృక్పథంతో చేపట్టారని గుర్తుచేశారు. ఈ ప్రతిపాదన ఏపీ పునిర్వభజన చట్టం, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, 1980లో ట్రిబ్యునల్‌లో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందానికి పూర్తి విరుద్ధమని.. అందువల్ల దాన్ని తిరస్కరించాలని కోరారు.
బెడ్తి–వరద లింక్ ప్రాజెక్టులో వాటా
కర్ణాటకలో బెడ్తి–వరద అనుసంధాన ప్రాజెక్టు చేపట్టేందుకు ఎంఓయూ చేసుకోవడానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముందుకు రాగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు సమ్మతి తెలిపారు. ఈ ప్రాజెక్టులో తమకు 50 శాతం వాటా ఇవ్వాలని తెలంగాణ కోరగా కొంత వాటా కావాలని ఏపీ డిమాండ్ చేసింది. ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాలను తరలించడాన్ని సూత్రప్రాయంగా అంగీకరిస్తామని.. కానీ తరలించే నీటిలో 50 శాతం జలాలను తమకే కేటాయించాలని తెలంగాణ కోరింది.
ఏపీ చేసిన పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించింది. మరోవైపు గోదావరి–కావేరి అనుసంధానంలో తరలించే జలాల్లో తమ వాటా 34.40 నుంచి 40 టీఎంసీలకు పెంచాలని కర్ణాటక అధికారులు కోరారు. అనుసంధానంలో తమకు ఎలాంటి నీటి వాటాలు కేటాయించకపోవడంపై మహారాష్ట్ర, కేరళ అభ్యంతరం తెలపగా తక్షణమే పనులు చేపట్టాలని తమిళనాడు, పుదుచ్చేరి కోరాయి.
అన్ని రాష్ట్రాల అధికారుల అభిప్రాయాలను తెలుసుకున్న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్.. ఏకాభిప్రాయ సాధన కోసం బేసిన్‌లోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో త్వరలో సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో తెలంగాణ నీటిపారుదలశాఖ గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్య ప్రసాద్ పాల్గొన్నారు.
అంగీకరించాలన్న కేంద్ర మంత్రి
సమావేశంలో ఇచ్చంపల్లి (గోదావరి) నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా), అరణియార్ రిజర్వాయర్ మీదుగా 148 టీఎంసీల గోదావరి జలాలను కావేరికి తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన అనుసంధాన ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చించారు. ఈ అనుసంధానంలో అంతర్భాగంగా కర్ణాటకలో బెడ్తి–వరద అనుసంధానం చేపడతామని కేంద్ర మంత్రి పాటిల్ పేర్కొన్నారు.
కావేరికి తరలించే 148 టీఎంసీల (ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని జలాలు) గోదావరి జలాలు, బెడ్తి–వరద అనుసంధానంలో తరలించే 18.5 టీఎంసీలు వెరసి 166.5 టీఎంసీలలో.. తెలంగాణకు 43.65, ఏపీకి 43.86, తమిళనాడుకు 40.93, కర్ణాటకకు 34.40, పుదుచ్చేరికి 2.19 టీఎంసీలు కేటాయిస్తామన్నారు. దీనివల్ల 6,78,797 హెక్టార్లకు నీళ్లు అందించడంతోపాటు తాగునీటిని అందించవచ్చన్నారు.
దీనిపై ఛత్తీస్‌గఢ్, ఏపీ అభ్యంతరం తెలిపాయి. నాగార్జునసాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తే దాని కింద ఉన్న ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారుతుందని ఏపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గోదావరి–కావేరి అనుసంధానంలో కొత్త రిజర్వాయర్లు నిర్మించాలని సూచించింది.


