breaking news
linking rivers
-
పోలవరం – బనకచర్లను తిరస్కరించాలి
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి అనుసంధానంపై నదీ పరివాహక ప్రాంతాల (బేసిన్)లోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని కేంద్ర జలశాఖ మంత్రి సీఆర్ పాటిల్ చెప్పారు. ఏకాభిప్రాయం సాధించాకే గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని స్పష్టం చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన నదుల అనుసంధానంపై ఏర్పాటైన ప్రత్యేక కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంతోపాటే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) 39వ సాధారణ సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఇచ్చంపల్లి నుంచి కాకుండా పోలవరం నుంచి గోదావరి–కావేరి నదుల అనుసంధానం చేపట్టాలని.. అందులో భాగంగా పోలవరం–బనకచర్ల–సోమశీల–కావేరి అనుసంధాన ప్రాజెక్టు చేపట్టాలని ఈ సమావేశంలో ఏపీ చేసిన ప్రతిపాదనపై తెలంగాణ అంతర్రాష్ట్ర జల వ్యవహారాల సీఈ కె. ప్రసాద్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ ప్రాజెక్టుతో కేవలం ఏపీ, తమిళనాడుకే ప్రయోజనం కలుగుతుందని.. మరోవైపు గోదావరి–కావేరి అనుసంధానాన్ని జాతీయ దృక్పథంతో చేపట్టారని గుర్తుచేశారు. ఈ ప్రతిపాదన ఏపీ పునిర్వభజన చట్టం, గోదావరి ట్రిబ్యునల్ తీర్పు, 1980లో ట్రిబ్యునల్‌లో జరిగిన అంతర్రాష్ట్ర ఒప్పందానికి పూర్తి విరుద్ధమని.. అందువల్ల దాన్ని తిరస్కరించాలని కోరారు. బెడ్తి–వరద లింక్ ప్రాజెక్టులో వాటా కర్ణాటకలో బెడ్తి–వరద అనుసంధాన ప్రాజెక్టు చేపట్టేందుకు ఎంఓయూ చేసుకోవడానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ముందుకు రాగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావు సమ్మతి తెలిపారు. ఈ ప్రాజెక్టులో తమకు 50 శాతం వాటా ఇవ్వాలని తెలంగాణ కోరగా కొంత వాటా కావాలని ఏపీ డిమాండ్ చేసింది. ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాలను తరలించడాన్ని సూత్రప్రాయంగా అంగీకరిస్తామని.. కానీ తరలించే నీటిలో 50 శాతం జలాలను తమకే కేటాయించాలని తెలంగాణ కోరింది. ఏపీ చేసిన పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించింది. మరోవైపు గోదావరి–కావేరి అనుసంధానంలో తరలించే జలాల్లో తమ వాటా 34.40 నుంచి 40 టీఎంసీలకు పెంచాలని కర్ణాటక అధికారులు కోరారు. అనుసంధానంలో తమకు ఎలాంటి నీటి వాటాలు కేటాయించకపోవడంపై మహారాష్ట్ర, కేరళ అభ్యంతరం తెలపగా తక్షణమే పనులు చేపట్టాలని తమిళనాడు, పుదుచ్చేరి కోరాయి. అన్ని రాష్ట్రాల అధికారుల అభిప్రాయాలను తెలుసుకున్న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్.. ఏకాభిప్రాయ సాధన కోసం బేసిన్‌లోని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో త్వరలో సమావేశాన్ని నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో తెలంగాణ నీటిపారుదలశాఖ గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్య ప్రసాద్ పాల్గొన్నారు. అంగీకరించాలన్న కేంద్ర మంత్రి సమావేశంలో ఇచ్చంపల్లి (గోదావరి) నుంచి నాగార్జునసాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా), అరణియార్ రిజర్వాయర్ మీదుగా 148 టీఎంసీల గోదావరి జలాలను కావేరికి తరలించేలా ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించిన అనుసంధాన ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చించారు. ఈ అనుసంధానంలో అంతర్భాగంగా కర్ణాటకలో బెడ్తి–వరద అనుసంధానం చేపడతామని కేంద్ర మంత్రి పాటిల్ పేర్కొన్నారు. కావేరికి తరలించే 148 టీఎంసీల (ఛత్తీస్‌గఢ్ కోటాలో వాడుకోని జలాలు) గోదావరి జలాలు, బెడ్తి–వరద అనుసంధానంలో తరలించే 18.5 టీఎంసీలు వెరసి 166.5 టీఎంసీలలో.. తెలంగాణకు 43.65, ఏపీకి 43.86, తమిళనాడుకు 40.93, కర్ణాటకకు 34.40, పుదుచ్చేరికి 2.19 టీఎంసీలు కేటాయిస్తామన్నారు. దీనివల్ల 6,78,797 హెక్టార్లకు నీళ్లు అందించడంతోపాటు తాగునీటిని అందించవచ్చన్నారు. దీనిపై ఛత్తీస్‌గఢ్, ఏపీ అభ్యంతరం తెలిపాయి. నాగార్జునసాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తే దాని కింద ఉన్న ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారుతుందని ఏపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గోదావరి–కావేరి అనుసంధానంలో కొత్త రిజర్వాయర్లు నిర్మించాలని సూచించింది. -
అంగీకరించకపోతే పక్కన పెట్టేస్తాం
సాక్షి, హైదరాబాద్: జాతీయ ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకుని గోదావరి– కావేరి అనుసంధానం ప్రాజెక్టుకు రాష్ట్రా లన్నీ సమ్మతి తెలపాలని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కోరారు. ఈ ప్రాజెక్టుపై రాష్ట్రాలు నాలుగేళ్లుగా నాన్చుడు వైఖరిని అవలంబిస్తున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో పదేళ్లు గడిచినా ప్రాజెక్టు ముందుకు కదలదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రాలు సహకరించకపోతే ప్రాజెక్టును పక్కనపెట్టక తప్పదని తేల్చి చెప్పారు. రాష్ట్రాలన్నింటికీ సాధ్యమైనంత గరిష్టంగా నీటి కేటాయింపులు చేశామని, ప్రాజెక్టు ద్వారా 148 టీఎంసీలే తరలిస్తున్నందున కేటాయింపులు పెంచాలన్న రాష్ట్రాల డిమాండ్లను నెరవేర్చడం సాధ్యం కాదని కూడా చెప్పారు. నదుల అనుసంధానంపై మంగళవారం ఢిల్లీలో జరిగిన నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) సమావేశంలో ఆమె మాట్లాడారు. నెలాఖరులోగా రాష్ట్రాల నీటిపారుదల శాఖల అధిపతులతో ఢిల్లీలో ప్రత్యక్ష విధానంలో సమావేశం నిర్వహించి ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నించాలని ఎన్‌డబ్ల్యూడీఏకు దేబశ్రీ సూచించారు. జనవరిలో అన్ని రాష్ట్రాల కార్యదర్శులతో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారు. తెలంగాణకు 50% కోటా ఇవ్వలేం..ప్రాజెక్టు ద్వారా తరలించనున్న 148 టీఎంసీల్లో 50 శాతం తమకు కేటాయించాలన్న తెలంగాణ డిమాండ్‌ను దేబశ్రీ తోసిపుచ్చారు. గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద కొత్త బరాజ్ నిర్మించడానికి బదులు సమ్మ క్క బరాజ్ నుంచే నీళ్లను తరలించాలనే తెలంగాణ ప్రతి పాదనలను పరిశీలి స్తున్నామని చెప్పారు. సమ్మక్క బరాజ్‌లో 83 మీటర్ల నీటి మట్టానికి ఎగువన లభ్యతగా ఉండే నీళ్లను మాత్రమే ఈ ప్రాజెక్టులో భాగంగా తరలించాలని, ఆ మేరకు నీటి లభ్యతను తేల్చడానికి సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించాలన్న రాష్ట్రం సూచనను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. ప్రాజెక్టులో భాగంగా నల్లగొండ జిల్లాలో రెండు కొత్త రిజర్వాయర్లు నిర్మించాలని రాష్ట్రం చేసిన మరో ప్రతిపాదనకు సూత్రప్రాయంగా సమ్మతి తెలిపారు. సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, సీఈ మోహన్ కుమార్, గోదావరి బేసిన్ డీడీ సుబ్రమణ్యం ప్రసాద్ మాట్లాడారు. కృష్ణా జలాల పంపిణీపై కృష్ణా ట్రిబ్యునల్–2 తేల్చిన తర్వాతే నాగార్జునసాగర్ ప్రాజెక్టును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వినియోగించుకోవాలని చెప్పారు. తక్కువ భూసేకరణ చేసేలా ప్రాజెక్టు అలైన్‌మెంట్‌ను రూపొందించాలని కోరగా దేబశ్రీ అంగీకరించారు. పోలవరం నుంచి అనుసంధానం సాధ్యం కాదుపోలవరం ప్రాజెక్టు నుంచి నదుల అనుసంధానం చేపట్టాలని ఏపీ చేసిన విజ్ఞప్తిని దేబశ్రీ తోసిపుచ్చారు. పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లను తరలిస్తే ఏపీ, తమిళనాడు, పాండిచ్చేరి మాత్రమే లబ్ధి పొందుతాయని, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర భాగస్వామ్యం కోల్పోతాయని స్పష్టం చేశారు. ఏపీ భూభాగం పరిధిలో రెండు నదుల అనుసంధానానికి ప్రతిపాదనలతో వస్తే సహకరిస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకకు కోటా పెంచలేం..తమ రాష్ట్ర భూభాగంలో మాత్రమే జరగనున్న బెడ్తి–వార్దా నదుల అనుసంధానం ప్రాజెక్టును గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టు పరిధి నుంచి తొలగించాలని కర్ణాటక చేసిన విజ్ఞప్తిపై దేబశ్రీ ముఖర్జీ సానుకూలంగా స్పందించారు. గోదావరి–కావేరి ప్రాజెక్టులో కర్ణాటకకు 16 టీఎంసీల తాగునీరు మాత్రమే కేటాయించారని, సాగునీరును సైతం కేటాయించాలని చేసిన విజ్ఞప్తిని తిరస్కరించారు. తాము ఇప్పటికే సమ్మతి తెలుపుతూ ఎంఓయూపై సంతకాలు చేశామని తమిళనాడు, పుదుచ్చేరిలు తెలిపాయి. తమ రాష్ట్రం సొంతంగా చేపట్టిన దామన్‌గంగా–వైతర్ణ–గోదావరి నదుల అనుసంధానాన్ని గోదావరి–కావేరి ప్రాజెక్టు కింద చేర్చాలని మహారాష్ట్ర విజ్ఞప్తి చేసింది. -
వరద జలాల కోసమే ‘అనుసంధానం’
రాష్ట్రాల నికర జలాల్లో వాటాకు నష్టంలేదు నదుల అనుసంధాన కమిటీ సభ్యుడు వెదిరె శ్రీరాం బుధవారం ఢిల్లీలో కమిటీ తొలి సమావేశం సాక్షి, హైదరాబాద్: వరద, మిగులు జలాల వినియోగం కోసమే నదుల అనుసంధాన ప్రతిపాదన తెరపైకి వచ్చిందని జాతీయ నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుడు వెదిరె శ్రీరాం పేర్కొన్నారు. నదీజలాల వినియోగం, నికర జలాల్లో రాష్ట్రాలకు ఉన్న హక్కులను, వాటాలను పరిరక్షిస్తూనే వరద జలాలను వినియోగించుకోవడం నదుల అనుసంధానం లక్ష్యమన్నారు. దీనిపై రాష్ట్రాలకు అవగాహన కల్పించి, ఒప్పించి, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడానికి నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్ పనిచేస్తుందని చెప్పారు. దేశంలోని అన్ని నదులకు కలిపి 30 ప్రాంతాల్లో నదులను కలిపే అవకాశమున్నట్టుగా కేంద్రం గుర్తించిందని, నదుల అనుసంధాన ప్రక్రియ 1980-90 దశకంలోనే చర్చకు వచ్చిందని, వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు సాంకేతిక అంచనాలు కూడా తయారయ్యాయని వివరించారు. పార్టీ నేతలు కుమార్‌రావు, దాసరి మల్లేశంతో కలసి హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రపంచ దేశాల్లో నంబర్‌వన్‌గా ఎదగడానికి భారత్ పోటీపడుతున్న క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో వరదలతో తీవ్ర నష్టం జరుగుతుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో తీవ్ర కరువు, వర్షాభావ పరిస్థితులు నెలకొనడం ప్రతిబంధకంగా మారుతోందని చెప్పారు. అస్సాం, బిహార్ వంటి రాష్ట్రాలు ప్రతి ఏటా ముంపునకు గురవుతున్నాయన్నారు. తెలంగాణతోపాటు విదర్భ, రాజస్థాన్, రాయలసీమ కరువుతో సాగునీటికే కాక తాగునీటికి కూడా అల్లాడిపోయే పరిస్థితి ఉందని శ్రీరాం వివరించారు. బ్రహ్మపుత్ర, గంగా నదుల్లో నీటి లభ్యత ఎక్కువ ఉన్నా కరువు ఉన్న రాష్ట్రాల్లో వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. వరదలకు, కరువు కాటకాలకు ఏకైక పరిష్కార మార్గం నదుల అనుసంధానమని శ్రీరాం పేర్కొన్నారు. గతంలో రూపొందించిన ప్రతిపాదనల ప్రకారం 10 కోట్ల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరందించడానికి, 30 వేల మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి 30 లింకులను ప్రతిపాదించినట్టుగా వివరించారు. దీనికి రూ. 4.5 లక్షల కోట్లు వ్యయం అవుతుందని అప్పడు అంచనాలు తయారయ్యాయని, యూపీఏ ప్రభుత్వం దీనిని పదేళ్లపాటు పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం తెరపైకి వచ్చిందన్నారు. 2004లో రూపొందించిన లింకుల్లో అవసరమైన మార్పుచేర్పులు ఉంటాయన్నారు. నదుల అనుసంధాన ప్రక్రియకు నిధుల సమీకరణ ఎలా, పెట్టిన పెట్టుబడుల ప్రయోజనం ఎంత మేరకు ఉంటుంది, ఖర్చుకు తగిన ప్రతిఫలం ఉంటుందా అనేదానిపై కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. వీటితో పాటు పర్యావరణ, సామాజిక ప్రభావం, సహాయ పునరావాస కార్యక్రమాల వంటివాటిపైనా అధ్యయనం చేస్తామన్నారు. సుప్రీంకోర్టు కూడా నదుల అనుసంధానం చేయాలని సూచనలు చేసిందని, ప్రతీ రెండు వారాలకు ఒకసారి దీనిపై నివేదికను కూడా కోరుతోందని చెప్పారు. ఒక రాష్ట్రంలోనే నదుల పరీవాహక ప్రాంతాల మధ్య అనుసంధానం, రెండు రాష్ట్రాల మధ్య అనుసంధానం వంటి వాటిపై ఇంకా చర్చించాల్సి ఉందన్నారు. నికర జలాల్లో రాష్ట్ర వాటాలో ఒకచుక్క కూడా తగ్గించకుండా ముంపు బారిన పడకుండా వరద నీటిని తీసుకుపోతామంటే ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చునని శ్రీరాం ఆశాభావం వ్యక్తం చేశారు. టాస్క్ఫోర్సు కమిటీ తొలి సమావేశం ఢిల్లీలో బుధవారం జరుగుతుందన్నారు. వీలైనంత తొందరలోనే నదుల అనుసంధాన ప్రక్రియ ప్రారంభమవుతుందని శ్రీరాం వెల్లడించారు.


