
ఇప్పటికే దాఖలైన 2.19 లక్షల దరఖాస్తులు
ఇప్పటివరకు 44,415 కార్డులు మంజూరు
జీహెచ్‌ఎంసీకి పెండింగ్ దరఖాస్తుల విచారణ బాధ్యత
సాక్షి, సిటీ బ్యూరో: హైదరాబాద్‌లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న పేదలకు ఎదురుచూపులు తప్పడంలేదు. కార్డుల పంపిణీ ప్రక్రియ ఆలస్యం కానుంది. వాస్తవానికి శుక్రవారం కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించాలి. ఈ మేరకు కసరత్తు పూర్తయినప్పటికీ హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అందుబాటులో లేకపోవడంతో ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 15 సీఎం రేవంత్‌రెడ్డి సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది.
ఇదీ పరిస్థితి..
హైదరాబాద్ జిల్లాలో సుమారు 2,19, 321 కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. అయితే కేవలం 47,374 దరఖాస్తులపై పౌర సరఫరాల శాఖ అధికారులు క్షేత్రస్థాయి విచారణ నిర్వహించినట్లు తెలుస్తోంది. వాటిల్లో 44,415 దరఖాస్తులు మాత్రమే అర్హత సాధించగా, 2,959 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఆరు నెలల నుంచి కొత్త రేషన్‌కార్డుల కోసం మీ సేవ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి విచారణ మాత్రం నత్తకు నడక నేర్పిస్తోంది.

సిబ్బంది కొరత వల్ల విచారణ ప్రక్రియ వేగంగా ముందుకు సాగడం లేదని అధికారులు చెబుతున్నారు. వాస్తవంగా దరఖాస్తులను 360 డిగ్రీల్లో పరిశీలించి ఆస్తి, ఆదాయ వివరాల సేకరణ, వాహనాల పన్ను చెల్లింపు వంటి అంశాల్లో విచారణ జరిపి అర్హులను తేల్చాల్సి ఉంటుంది. అయితే సిబ్బంది మాత్రం వీలును బట్టి ఒక దగ్గర కూర్చొని దరఖాస్తుదారులను పిలిచి వివరాలు సేకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 20 శాతం దరఖాస్తులు కూడా క్షేత్ర స్థాయి విచారణకు నోచుకోకపోవడం గమనార్హం.
1,100 మంది ఆర్పీల సేవలు
తాజాగా కొత్తరేషన్ కార్డుల పెండింగ్ దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ బాధ్యతను జీహెచ్‌ఎంసీకి అప్పగించినట్లు తెలుస్తోంది. పెండింగ్ దరఖాస్తుల పరిశీలన సర్కిళ్లవారీగా నోడల్ అధికారుల పర్యవేక్షణలో వేగంగా సాగాలని ఇటీవల మంత్రి పొన్నం అధికారులను ఆదేశించారు. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ నుంచి 1,100 మంది ఆర్పీలను వినియోగించుకోవాలని సూచించారు. దీంతో పౌరసరఫరాల శాఖ పెండింగ్ దరఖాస్తుల విచారణ ను జీహెచ్‌ఎంసీకి అప్పగించినట్లు తెలుస్తోంది.