సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు అందించారు. ఆ నోటీసులకు కేసీఆర్ స్పందించినట్లు తెలుస్తోంది
సిట్ విచారణకు గడువు కోరే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. మూడు రోజుల తర్వాత లేదా మున్సిపల్ ఎన్నికల తర్వాత విచారణకు వెళ్లాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో రేపు సిట్ విచారణకు హాజరు అవ్వాలా? వద్దా?. సమయం కోరాలా? అన్న అంశంపై చర్చించేందుకు కాసేపట్లో ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో ముఖ్యనేతలు, లీగల్‌సెల్‌తో కేసీఆర్ సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం గడువుకోరే అంశంపై స్పష్టత రానుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు కేటీఆర్,హరీష్ రావులు ఫామ్ హౌస్‌కు బయల్దేరారు
ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు విచారణ చేపట్టేందుకు సిట్ బృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.కొద్ది సేపటి క్రితం నంది నగర్‌లోని కేసీఆర్ నివాసానికి పోలీసులు వెళ్లారు. నందినగర్‌లోని తన నివాసంలో కేసీఆర్‌ను విచారించాల్సి వస్తే.. భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చినట్లు సమాచారం.
ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నందినగర్‌లోని కేసీఆర్ పీఏకు నోటీసులు అందించారు. రేపు మధ్యాహ్నం 3గంటలకు సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అయితే, వయస్సు రిత్యా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు మినహాయింపు ఇచ్చారు. కేసీఆర్ ఎక్కడ కోరుకుంటే అక్కడ విచారణ చేపడతామని అన్నారు.


