ఖనిజాల ‘పర్వత’o | New direction for the industrial sector with key minerals | Sakshi
Sakshi News home page

ఖనిజాల ‘పర్వత’o

Jun 18 2026 3:29 AM | Updated on Jun 18 2026 3:29 AM

New direction for the industrial sector with key minerals

పర్వతాపూర్‌లో 15.25 మిలియన్‌ టన్నుల వెనేడియం నిల్వలు 

87 మిలియన్‌ టన్నులఅల్యూమినస్‌ లేటరైట్‌ 

‘ఈ– వేలం’లో ఎన్‌ఎల్‌సీఇండియాకు హక్కులు 

కీలక ఖనిజాలతో పారిశ్రామిక రంగానికి కొత్త దిశ 

సాక్షి, హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల పరిధిలోని పర్వతాపూర్‌ దేశంలోని అత్యంత కీలక ఖనిజ కేంద్రాల్లో ఒకటిగా అవతరించబోతోంది. జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) నిర్వహించిన అధ్యయనాల్లో పర్వతాపూర్‌ బ్లాక్‌లో భారీ స్థాయిలో వెనేడియం, టైటానియం, అల్యూమినస్‌ లేటరైట్‌ ఖనిజ నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. సుమారు 335.50 హెక్టార్ల విస్తీర్ణంలో 15.25 మిలియన్‌ టన్నుల వెనేడియం నిక్షేపాలు, 87 మిలియన్‌ టన్నుల అల్యూమినస్‌ లేటరైట్‌ నిల్వలు ఉన్నట్టు జీఎస్‌ఐ అంచనా వేసింది. 

కొత్తగా కనుగొన్న ఈ ఖనిజ బ్లాక్‌ను కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈ నెల 11న ‘క్రిటికల్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ మినరల్‌ బ్లాక్స్‌’కేటగిరీలో ‘ఈ వేలం’వేసింది. ఎన్‌ఎల్‌సీ ఇండియా ఈ బ్లాక్‌ను దక్కించుకుంది. ఇక్కడ లభ్యమవుతున్న వెనేడియం, టైటానియం ఖనిజాలు దేశ పారిశ్రామిక, రక్షణ, శక్తి రంగాలకు అత్యంత ప్రాధాన్యమైనవిగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఖనిజాల కోసం భారత్‌ విదేశీ దిగుమతులపై గణనీయంగా ఆధారపడుతోంది. పర్వతాపూర్‌ గనుల అభివృద్ధితో దేశీయ అవసరాలకు స్థానిక వనరులు అందుబాటులోకి వస్తాయి. 

వెనేడియం, టైటానియం కీలకం 
ప్రపంచంలో అరుదుగా లభించే ఖనిజాల్లో ఒకటైన వెనేడియంను అధిక దృఢత్వం కలిగిన ప్రత్యేక ఉక్కు తయారీ, ఎలక్ట్రిక్‌ వాహనాల బ్యాటరీలు, దీర్ఘకాలిక శక్తి నిల్వ చేసే బ్యాటరీలు, అణు, రక్షణ రంగ పరికరాల తయారీలో ఉపయోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక శక్తి నిల్వ వ్యవస్థలకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో వెనేడియం ప్రాధాన్యం మరింత పెరుగుతోంది. మరోవైపు ఏరోస్పేస్‌ రంగానికి టైటానియం వెన్నెముకగా నిలుస్తోంది. 

» తక్కువ బరువు, అధిక బలం, తుప్పు నిరోధక లక్షణాల కారణంగా టైటానియంను విమానాల తయారీ, అంతరిక్ష నౌకలు, క్షిపణి వ్యవస్థలు, నౌకాదళ పరికరాలు, అధునాతన వైద్య పరికరాల్లో విస్తృతంగా వినియోగిస్తారు. భారత రక్షణ, అంతరిక్ష రంగాలకు కీలకమైన ముడి సరుకు ఇది.  
» 87 మిలియన్‌ టన్నుల అల్యూమినస్‌ లేటరైట్‌ భవిష్యత్‌లో అల్యూమినా, అల్యూమినియం పరిశ్రమలకు ఉపయోగపడే అవకాశముంది.  

తెలంగాణకు కొత్త పారిశ్రామిక దిశ 
పర్వతాపూర్‌ ఇప్పటివరకు వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఖనిజ సంపద వెలుగులోకి రావడంతో తెలంగాణలో క్రిటికల్‌ మినరల్స్‌ రంగానికి కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. గనుల అభివృద్ధి, ఖనిజ ప్రాసెసింగ్‌ యూనిట్లు, అనుబంధ పరిశ్రమలు ఏర్పడితే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు రాష్ట్రానికి గణనీయమైన ఆదాయం సమకూరుతుంది. 

ఎన్‌ఎల్‌సీ ఇండియా ఈ బ్లాక్‌ను దక్కించుకోవడం ద్వారా లిగ్నైట్, విద్యుత్‌ రంగాలకే పరిమితమైన సంస్థ ఇప్పుడు క్రిటికల్‌ మినరల్స్‌ రంగంలోనూ అడుగుపెట్టినట్టయ్యింది. దేశభద్రత, రక్షణ సామర్థ్యం, అధునాతన తయారీ రంగాలకు అవసరమైన కీలక ఖనిజాల నిలయంగా పర్వతాపూర్‌ త్వరలో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశముందని నిపుణులు అంటున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement