అభ్యంతరాలకు గడువు జూన్ 28
ఒక్కో ప్రశ్నకు ఫీజు రూ. 200
అభ్యంతరం నెగ్గితే ఫీజు వాపస్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాలకు నిర్వహించే నీట్–యూజీ 2026 పరీక్షకు సంబంధించిన ప్రొవిజనల్ ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) గురువారం విడుదల చేసింది. జూన్ 21న జరిగిన రీ–ఎగ్జామినేషన్‌కు సంబంధించిన నాలుగు సెట్‌ల ప్రశ్నపత్రాలు, ‘ప్రొవిజనల్ ఆన్సర్ కీ’లను అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ సమాధానాలను సరిచూసుకుని మార్కులపై ప్రాథమిక అంచనా వేసుకునే అవకాశం లభించింది.
మూల్యాంకనానికి ముందే అభ్యంతరాల స్వీకరణ
నీట్–యూజీ ఫలితాల ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు పారదర్శకత పెంచేందుకు ఎన్‌టీఏ ఈ కొత్త విధానాన్ని అనుసరించింది. సాధారణంగా ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ పూర్తైన తర్వాత అభ్యంతరాల స్వీకరణ జరుగుతుంది. ఈసారి ఆ ప్రక్రియ పూర్తికాక ముందే ప్రొవిజనల్ కీని విడుదల చేసింది. దీంతో విద్యార్థులకు ముందుగానే తమ సందేహాలను తెలియజేసే అవకాశం కలిగింది. ప్రొవిజనల్ ఆన్సర్ కీలో ఏదైనా తప్పు ఉందని భావిస్తే అభ్యర్థులు జూన్ 28 రాత్రి 11.50 గంటల వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను నమోదు చేయవచ్చు.
ఒక్కో ప్రశ్నపై అభ్యంతరం దాఖలు చేయడానికి రూ.200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నిపుణుల కమిటీ పరిశీలనలో ఆ అభ్యంతరం సరైనదిగా తేలితే చెల్లించిన మొత్తం పూర్తిగా తిరిగి చెల్లిస్తామని ఎన్‌టీఏ తెలిపింది. అభ్యర్థులు తమ ప్రశ్నపత్రంపై ముద్రించిన సిరీస్ కోడ్‌కు అనుగుణంగానే అభ్యంతరాలు సమర్పించాలని సూచించింది. ఒక ప్రశ్నపై చేసిన అభ్యంతరం సమర్థన పొందితే, ఆ సవరణ అన్ని సెట్‌ల అభ్యర్థులకు సమానంగా వర్తిస్తుందని పేర్కొంది. అందువల్ల అదే ప్రశ్నపై వేర్వేరు సిరీస్ కోడ్‌ల కింద మళ్లీ మళ్లీ అభ్యంతరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఫైనల్ కీ ఆధారంగా మూల్యాంకనం
అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది ఆన్సర్ కీని విడుదల చేస్తారు. ఆ ‘ఫైనల్ కీ’ ఆధారంగానే ఓఎంఆర్ షీట్ల మూల్యాంకనం చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. వ్యక్తిగతంగా అభ్యంతరాలపై తీసుకున్న నిర్ణయాలను తెలియజేయబోమని, తుది ఆన్సర్ కీనే నిర్ణయాత్మకమని ఎన్‌టీఏ వెల్లడించింది. అలాగే ఓఎంఆర్ స్కానింగ్ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు వారి స్కాన్ చేసిన రెస్పాన్స్ షీట్లను పరిశీలించే అవకాశం కూడా కల్పించనున్నట్లు తెలిపింది. దీంతో ఫలితాల ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండనుంది.


