బాపు పట్టుదల.. బడికి పునరుజ్జీవం! | Narapunenipalli Primary Higher Secondary School Development in Wyra Mandal Khammam | Sakshi
Sakshi News home page

బాపు పట్టుదల.. బడికి పునరుజ్జీవం!

Jun 13 2025 3:49 AM | Updated on Jun 13 2025 3:49 AM

Narapunenipalli Primary Higher Secondary School Development in Wyra Mandal Khammam

నారపునేనిపల్లి పాఠశాలలో పది మంది చేరిక 

బ్రాండ్‌ అంబాసిడర్‌గా ‘ఒకే ఒక్క విద్యార్థి’ కీర్తన

వైరా రూరల్‌: ఖమ్మం జిల్లా వైరా మండలంలోని నారపునేనిపల్లి ప్రాథమికో­న్నత పాఠశాల మళ్లీ గాడిలో పడింది. గతేడాది స్కూల్‌ మొత్తంలో నాలుగో తరగతి చదివే కీర్తన అనే ఒకే విద్యార్థిని ఉండగా, అధికారులు పాఠశాలను మూసివేయాలని నిర్ణయించా­రు. కానీ కీర్తన తండ్రి అనిల్‌శర్మ పాఠశాలను మూసివేస్తే తన కుమార్తె చదువు మాన్పిస్తానని పట్టుబట్టడంతో కొనసా­గించారు.

ఈ విషయంపై ఈ ఏడాది మార్చి 23వ తేదీన ‘సాక్షి’దినపత్రిక ప్రధాన సంచికలో ‘బడిని బతికించిన బాపు’శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ ప్రత్యేక చొరవ తీసుకుని రూ.6 లక్షలతో పాఠశాలలో సకల వసతులు కల్పించారు. బడిబాట ద్వారా ప్రచారం చేయటంతో ఈసారి పది మంది పిల్లలు చేరారు. రూ.లక్ష వ్యయంతో ‘వుయ్‌ కెన్‌ లెర్న్‌’పేరిట ఇంగ్లిష్‌ ల్యాబ్‌ ఏర్పా­టు చేశారు. పాఠశాల మూతపడకుండా కొనసాగటానికి కారణమైన కీర్తనను స్కూల్‌కు ప్రచారకర్తగా ఎంపిక చేసి, ఆమె ఫొటో పాఠశాల గోడపై ఆకట్టుకునేలా అతికించారు.  

క్యాంపెయినింగ్‌కు దక్కిన ఫలితం..
బడిబాటలో భాగంగా గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పాఠశాలలో విద్య, ఇతర వసతులపై అవగాహన కల్పించాం. దీంతో తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించారు.     – ఉమాపార్వతి, ఉపాధ్యాయురాలు, నారపునేనిపల్లి యూపీఎస్‌

స్నేహితులు వచ్చారు..
గతేడాది బడిలో నేను మాత్రమే ఉండేదాన్ని. మా నాన్న ఉదయం దింపి తిరిగి తీసుకెళ్లే వారు. ఈ ఏడాది మరికొంత మంది చేరడంతో నాకు స్నేహితులు దొరికారు. – నందిగామ కీర్తన, 5వ తరగతి 

Advertisement
 
Advertisement
Advertisement