చలో నల్లమల.. 17 నుంచి టూర్‌ ప్రారంభం

Nallamala Forest Tour Starts From November 17 - Sakshi

అభయారణ్యంలో 24 గంటలపాటు గడిపే అవకాశం

వినోదం, విజ్ఞానం కలగలిపేలా అటవీశాఖ 

ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలు 

స్థానిక చెంచులే గైడ్లు  

సాక్షి, నాగర్‌కర్నూల్‌: అడవి గురించి తెలుసుకునేందుకు, వన్యప్రాణులను ప్రత్య క్షంగా వీక్షేందుకు, ఇక్కడ స్థానికంగా ఉన్న చెంచులతో మాట్లాడి వారి స్థితిగతులను అర్థం చేసుకునేందుకు నల్లమలలోని అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ అవకాశం కల్పిస్తోంది. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించేలా ప్రత్యేక టూర్‌ ప్యాకేజీలను అమలు చేస్తోంది.

నల్లమలలోని అరుదైన, ప్రత్యేకమైన వన్యప్రాణులు, పక్షులు, జీవ, వృక్షజాతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అటవీ సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదించేలా ప్రత్యేక జంగిల్‌ స్టే ప్యాకేజీలను అమలుపర్చబోతోంది. జంగిల్‌ స్టే, సఫారీ, ట్రెక్కింగ్‌తో పాటు స్థానిక గిరిజనులతో మమేకమయ్యేలా ప్యాకేజీలను రూపొందించింది. ఈనెల 17 నుంచి ఆన్‌లైన్‌ ద్వారా బుకింగ్‌ ప్రారంభంకానుంది.  

24 కి.మీ. మేర జంగిల్‌ సఫారీ.. 
అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లోని వన్యప్రాణులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలు గా సఫారీ వాహనంలో అడవిలోకి తీసుకెళ్తారు. అమ్రాబాద్‌ మండలంలో హైదరాబాద్‌– శ్రీశైలం రహదారిపై ఉన్న గుండం చెక్‌పోస్టు నుంచి ఫర్హాబాద్‌ వ్యూపాయింట్‌ వరకు తీసుకెళ్తారు.


నల్లమలలో జంగిల్‌సఫారీ 

ఇక్కడ నుంచి నల్లమల అటవీప్రాంతం చూడముచ్చటగా ఉంటుంది. అక్కడి నుంచి ఫర్హాబాద్‌ పెంట మీదుగా ఫర్హాబాద్‌ చెక్‌పోస్టు వరకు సఫారీ ప్రయాణం కొనసాగుతుంది. సుమారు 24 కి.మీ.మేర సాగే ఈ సఫారీలో పులులతో పాటు వివిధ వన్యప్రాణులను ప్రత్యక్షంగా చూసే అవకాశముంది. 

స్థానికంగా ఉండే చెంచులే టూరిస్టు గైడ్లు.. 
నల్లమలలో స్థానికంగా నివసించే చెంచులతో మమేకమై వారితో ముచ్చటించేందుకు ఏటీఆర్‌ అవకాశం కల్పిస్తోంది. చెంచుల స్థితిగతులు, జీవనవిధానంపై నాటిక రూపంలో ప్రదర్శనలు, పాటలను ఆలపిస్తారు. వారు తినే ఆహారం, స్థానికంగా ఉన్న వెరైటీలను సందర్శకులకు కూడా రుచి చూపిస్తారు.

మన్ననూరు నుంచి ఉమామహేశ్వర ఆలయం వరకు అడవిలోని కొండల మధ్య ట్రెక్కింగ్‌కు సైతం చెంచులే తీసుకెళ్తారు. నల్లమల అందాలను మనసారా ఆస్వాదించేలా ఫారెస్ట్‌ స్టే, సఫారీ, ట్రెక్కింగ్‌లను ఏటీఆర్‌ అధికారులు రూపొందించారు. రెండు రోజుల పాటు అడవిలో గడిపేలా ఈ ప్యాకేజీ ఉంటుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top