
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో టైగర్ సఫారీ
కృష్ణమ్మ పరవళ్లతో కనువిందు చేస్తున్న సోమశిల అందాలు
నాగార్జునసాగర్ రిజర్వాయర్ల వద్ద బోటింగ్‌తో జాలీట్రిప్
ప్రకృతి పారవశ్యానికి ఇదే సరైన సమయం
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీ అందాలను ఆస్వాదిస్తూ.. పులులు, చిరుతలు, వన్య ప్రాణులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అటవీశాఖ ఏర్పాట్లు చేసింది. ప్రకృతి ప్రేమికులు పరవశించిపోయేలా రోజంతా అడవి చెంతన గడిపేందుకు వీలుగా టైగర్ స్టే ప్యాకేజీలను అందిస్తోంది. టైగర్ సఫారీ వాహనంలో ప్రయాణిస్తూ వన్యప్రాణులను చూస్తూ.. దట్టమైన చెట్లతో ప్రకృతి అందాలను ఒకే చోట చేర్చినట్టు ఉండే వ్యూ పాయింట్లను వీక్షిస్తూ అమితమైన ఆనందాన్ని పొందొచ్చు.
రెండు రకాల ప్యాకేజీలతో టైగర్ స్టే..
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్, దోమలపెంట వద్ద రెండు రకాల టైగర్ స్టే ప్యాకేజీలను అటవీశాఖ అందిస్తోంది.
» మన్ననూర్ సమీపంలోని ఫర్హాబాద్ చెక్‌పోస్టు మీదుగా సఫారీ వాహనంలో జంగిల్ రైడ్, ఫర్హాబాద్ వ్యూ పాయింట్, మన్ననూర్‌లోని ప్రత్యేక కాటేజీల్లో వసతి సౌకర్యాలను కల్పిస్తోంది.
» శ్రీశైలం రిజర్వాయర్ చెంతనే ఉన్న దోమలపెంట వద్ద నైట్ స్టే, కాటేజీల్లో వసతి, దోమలపెంట నుంచి అక్కమహాదేవి గుహల వరకు కృష్ణానదిలో బో టు ప్రయాణం, కృష్ణమ్మ ఒడి నుంచి అక్కమహాదే వి గుహ వరకు ట్రెక్కింగ్ ఈ ప్యాకేజీలో ఉంది.
»ఒక్కో జంటకు రూ. 6,500 నుంచి 8 వేల వరకు చెల్లించి ఒక రోజంతా అడవిలో గడిపేలా ఈ ప్యాకేజీలను అమలు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో www.amrabadtiferrererve.com ద్వారా ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.
బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా సోమశిల
చుట్టూ పచ్చని నల్లమల కొండలు, మధ్యలో నీలి రంగు పులుముకొని పరవళ్లు తొక్కుతూ సాగిపోయే కృష్ణానది అందాలు, పురాతన ఆలయాల సౌరభాలతో సోమశిల ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకర్శిస్తోంది. శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో లాంచీ విహారం, బోటు షికారు ద్వారా పర్యాటకులు ప్రత్యేక అనుభూతిని పొందుతున్నారు.
ఇక్కడకు సమీపంలోనే ఉన్న పురాతన లలితా సోమేశ్వర ఆలయం, సంగమేశ్వర ఆలయం, జటప్రోలులోని మదనగోపాలస్వామి ఆలయాలను పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో ఉన్న సోమశిల గ్రామం ఇప్పుడు బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది.
శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా నీటితో నిండటంతో ఈ ప్రాంతం సముద్రంలా కనిపిస్తోంది. పర్యాటకుల వసతి కోసం ప్రైవేటు రిసార్టులతో పాటు స్థానికులు హోం స్టే ద్వారా తమ ఇళ్లను అద్దెకు ఇస్తున్నారు. కృష్ణానదిలో లభించే చేపలతో రుచికరమైన వంటకాలను అందిస్తూ సోమశిల గ్రామస్తులు ఆదాయాన్ని పొందుతున్నారు.
విస్తృతమవుతున్న లాంచీ సేవలు
ఈసారి వర్షాలు అధికంగా ఉండటంతో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాలన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో బోటింగ్ విహారానికి సౌలభ్యం ఉన్నచోట పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌లో లాంచీ విహారానికి పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. నాగార్జునసాగర్ హిల్‌కాలనీ నుంచి నాగార్జున కొండ, ఐలాండ్ మ్యూజియం వరకు సుమారు 18 కి.మీ.దూరం పాటు పర్యాటక శాఖ లాంచీ ప్రయాణానికి అవకాశం కల్పిస్తోంది. శుక్రవారం మినహా మిగతా రోజుల్లో నిత్యం లాంచీ అందుబాటులో ఉంటుంది.
పాకాలలోనూ...
వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. సరస్సు చుట్టూ పచ్చని అడవి, సరస్సు మధ్యలో ద్వీపాన్ని చూసేందుకు అటవీశాఖ బోటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇక్కడి బట్టర్‌ఫ్‌లై గార్డెన్‌తోపాటు చుట్టూ ఉన్న అభయారణ్యం అందాలను వీక్షిస్తూ ప్రకృతి ప్రేమికులు మురిసిపోతారు. చిలకలగుట్ట వ్యూపాయింట్ వద్ద వాచ్ టవర్, నైట్ క్యాంపింగ్‌నకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు.
పర్యాటకులకు వసతులు పెంచుతున్నాం..
కృష్ణాతీరంలో సోమశిల, అమరగిరి ప్రాంతాలు దేశ, విదేశ పర్యాటకులను సైతం ఆకర్షిస్తున్నాయి. అమరగిరి ఐలాండ్‌లో వెల్‌నెస్, స్పిరిచువల్ రిట్రీట్ ప్రాజెక్ట్ ద్వారా అధునాతన వసతులు, కాటేజీలు నిర్మిస్తున్నాం. సోమశిలను జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. – జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి