
తెలంగాణ ఉద్యమంలో పాల్గొని.. కనిపించడం లేదు
12 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం
గ్రీవెన్స్ సెల్‌లో తల్లిదండ్రుల వేడుకోలు
భూపాలపల్లి: ‘తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న మా కొడుకు కనిపించడం లేదు. 12 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాం. మా కుమారుడి జాడ చూపించండి’అంటూ వృద్ధ దంపతులు సోమవా రం గ్రీవెన్స్ సెల్‌లో కలెక్టర్‌ను వేడుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం గొర్లవీడుకు చెందిన మందల చిన్న సమ్మిరెడ్డి కుమారుడు రాజు 2013, జూన్ 20వ తేదీన హైదరాబాద్‌కు వెళ్లి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఆందోళనలో పాల్గొన్నాడు. అప్పటినుంచి అతడు ఇంటికి రాలేదు. దీంతో తండ్రి చిన్న సమ్మిరెడ్డి 2017, జూన్ 20న భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో కుమారుడి గురించి ఫిర్యాదు చేశారు.
ఈ కేసును ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు బదిలీ చేయగా, విచారణ జరిపిన పోలీసులు 2021లో రాజు ఆచూకీ లభ్యం కాలేదని వెల్లడించారు. కొడుకు ఆచూకీ కోసం తాము వెతికామని, కానీ ఇప్పటి వరకు ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదని రాజు తండ్రి .. కలెక్టర్ రాహుల్ శర్మ ఎదుట వాపోయారు. గత ప్రభు త్వం తమ కుమారుడిని తెలంగాణ అమరవీరుడిగా గుర్తించిందని, అయినా ఎటువంటి న్యాయం జరగలేదని తెలిపారు. ఉండటానికి ఇల్లు, తమ కూతురికి ఉద్యోగ అవకాశం కలి్పంచాలని సమ్మిరెడ్డి కోరారు.