కాంగ్రెస్‌లో చేరతానంటూ ఖర్గేకు కవిత ఫోన్‌ చేశారు: ఎంపీ అరవింద్‌

MP Arvind Alleged That Kavitha Called Kharge To Join Congress - Sakshi

సెకండ్‌ హ్యాండ్‌ ఎమ్మెల్యేలు బీజేపీకి అనవసరం: ఎంపీ అరవింద్‌

సాక్షి, హైదరాబాద్‌: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఎమ్మెల్సీ కవిత ఫోన్‌ చేసి కాంగ్రెస్‌లో చేరతానని కోరారని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ జాతీయ ప్రధానకార్యదర్శి తనకు చెప్పారన్నారు. గురువారం ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, ఎస్‌.ప్రకాష్‌రెడ్డితో కలిసి అరవింద్‌ ఇక్కడ మీడియాతో మాట్లాడారు. తండ్రి కేసీఆర్‌పై అలిగిన కవిత ఆయనను బెదిరించేందుకు తాను కాంగ్రెస్‌లో చేరతానని ఖర్గేకు ఫోన్‌ చేసిన విషయంపై లీకులు ఇచ్చిందని ఆరోపించారు. దీంతో భయపడిన కేసీఆర్‌ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం అంతిమయాత్రకు కవితను తన వెంటే లక్నోకు, ఢిల్లీ టూర్‌కు తీసుకెళ్లారన్నారు. తన వెంటే కూతురు ఉన్నదని మీడియా ముందు కేసీఆర్‌ డ్రామా ఆడారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే కాంగ్రెస్‌ పరిస్థితి బాగాలేకపోయినా వాళ్లు కూడా ఆమెను వద్దనుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చునని అన్నారు.

కవితను తీసుకొస్తామన్న వారిని సస్పెండ్‌ చేస్తాం
కవితను ప్రలోభపెట్టి పార్టీలోకి తీసుకొస్తామన్న వారిని బీజేపీ నుంచి సస్పెండ్‌ చేస్తామని అర్వింద్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో తానే స్వయంగా బండి సంజయ్, జేపీ నడ్డాలను డిమాండ్‌ చేస్తున్నానని చెప్పారు. కవిత, కేటీఆర్‌లను తమ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. సెకెండ్‌ హ్యాండ్‌ ఎమ్మెల్యేలు బీజేపీకి అవసరం లేదన్నారు. దేశంలోనే సిల్లీ సీఎంగా కేసీఆర్‌ మిగిలిపోయారని అర్వింద్‌ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ మోడల్‌ పాలనంటే బిడ్డకు 20 శాతం, కొడుక్కి 20 శాతం, ఎలక్షన్‌కు 20 శాతం కమీషన్లు ఖర్చు పెట్టడమేనని విమర్శించారు. కొడుకు, బిడ్డకు కమీషన్లు ఇచ్చేందుకే నూతన విద్యుత్‌ బిల్లుకు కేసీఆర్‌ అంగీకరించడం లేదని ఆరోపించారు.

ఇదీ చదవండి: ఆయన రాజకీయాలకు దూరమవ్వాలని ఫిక్స్‌ అయిపోయారా?.. ఆ రెండు చోట్ల కొత్త అభ్యర్థులేనా?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top