బయటకు వెళ్లి.. ఇంట్లోకి తెస్తుండ్రు

Most of Coronavirus Spreading FromYouth in Hyderabad - Sakshi

కరోనా వ్యాప్తికి యువత తీరే కారణం 

బాధితుల్లో 30 నుంచి 40 ఏళ్లవారే అధికం 

వివిధ పనుల కోసం..బైటకు వెళ్తున్న వారిలో యువతే ముందు 

మొత్తంగా..కోవిడ్‌ బారిన 65.6 శాతం పురుషులు, 34.4 శాతం మహిళలు

సాక్షి, సిటీబ్యూరో: ‘చిన్నపిల్లలు, వృద్ధులతో పోలిస్తే తమకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందనే భావన. వైరస్‌ సోకినా తమను ఏమీ చేయలేదనే ధీమా...వారిని..వారి కుటుంబ సభ్యులను ప్రమాదంలోకి నెట్టుతోంది. 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే వివిధ రకాల పనుల పేరుతో బయటకు వెళ్తున్నారు. ఈ సమయంలో కనీసం మాస్కు కూడా ధరించడం లేదు. అవసరం లేకపోయినా నగరమంతా చుట్టేస్తున్నారు. కోవిడ్‌ బారిన పడుతున్నారు. ప్రస్తుతం నమోదైన పాజిటివ్‌ కేసులను పరిశీలిస్తే..ఇదే విషయం స్పష్టమవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 57142 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 36 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో 42909 మంది ఇప్పటికే పూర్తిగా కోలుకోగా, ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 3032 మంది చికిత్స పొందుతున్నారు. మరో 11208 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.  

ఇంట్లో వారికి అంటిస్తున్నారు... 
కోవిడ్‌ తొలి బాధితుల్లో 31 నుంచి 40 ఏళ్లలోపు వారు 25 శాతం మంది ఉండగా, ఆ తర్వాతి స్థానంలో 21 నుంచి 30 ఏళ్లలోపు వారు 22.1 శాతం మంది ఉన్నారు. 41 నుంచి 50 ఏళ్లలోపు వారు 18.6 శాతం మంది ఉన్నారు. బాధితుల్లో 50 ఏళ్లలోపు వారు 74.4 శాతం మంది ఉన్నారు. వీరిలో 65.6 శాతం మంది పురుషులు ఉంటే...34.4 శాతం మహిళలు ఉన్నారు. వీరంతా బైట తిరిగి వైరస్‌ను ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. 90 శాతం మందిలో వైరస్‌ లక్షణాలు కన్పించడం లేదు. తమకేమీ కాలేదనే ధీమాతో కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీరు వైరస్‌ను నిర్లక్ష్యం చేయడంతో వారి నుంచి ఇంట్లోని చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులకు వైరస్‌ విస్తరిస్తున్నట్లు వైద్యుల పరిశీలనలో స్పష్టమైంది. 

ఒకరి మృతితో అప్రమత్తం
యువకులతో పోలిస్తే వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటంతో వారి ఆరోగ్యం త్వరగా క్షీణిస్తుంది. సకాలంలో వైరస్‌ను గుర్తించక పోవడం....వైరస్‌ ఏమీ చేయలేదనే ధీమాతో చికిత్సలను నిర్లక్ష్యం చేయడం వల్ల అప్పటికే వారి శరీరంలో వైరస్‌ ఉధృతి పెరిగి ఊపిరాడక మృతి చెందుతున్నారు. తీరా ఇంటి పెద్ద మృతి చెందడంతో ఆ తర్వాత ఇతర కుటుంబ సభ్యులు అప్రమత్తం అవుతున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. 

తాజాగా 644 పాజిటివ్‌ కేసులు నమోదు 
ఇదిలా ఉంటే హైదరాబాద్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో మంగళవారం 93 సెంటర్ల పరిధిలో 3891 మందికి పరీక్షలు చేయగా, వీరిలో 644 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ నెల 8వ తేదీ నుంచి  ఇప్పటి వరకు 56529 మందికి పరీక్షలు చేయగా, 9423 మందికి పాజిటివ్‌ నిర్ధా రణ అయింది. మొత్తంగా పాజిటివ్‌ శాతం 17 నమోదైంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top