
జూబ్లీహిల్స్‌లో ప్రజాభిప్రాయంపై మరింత విస్తృతంగా సర్వే
సీఎం రేవంత్‌తో పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ భేటీలో నిర్ణయాలు
పాదయాత్రకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిన సీఎం
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయి నాయకత్వానికి ఈ వారంలోనే పదవుల పంపకానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, బోర్డులకు డైరెక్టర్లు, సభ్యుల నియామకాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ నిర్ణయించారు. దీంతో నామినేటెడ్ పదవుల కోసం మండల, జిల్లా స్థాయి కాంగ్రెస్ నేతల ఎదురుచూపులకు మోక్షం కలగనుంది.
రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీలో నెలకొన్న పరిణామాలపై చర్చించేందుకు మహేశ్‌కుమార్‌గౌడ్ సోమవారం జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. గంటన్నరకుపైగా సాగిన ఈ భేటీలో నామినేటెడ్ పదవులు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, జనహిత పాదయాత్ర, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను పారీ్టపరంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపై చర్చించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై చర్చలో భాగంగా ఆ నియోజకవర్గంలోని ప్రజలకు పార్టీని మరింత దగ్గర చేసే కార్యాచరణ రూపొందించాలని.. మంత్రులతోపాటు పార్టీ నాయకత్వానికి కూడా మరిన్ని బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. అలాగే జూబ్లీహిల్స్ ఓటర్ల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి మరింత విస్తృతంగా సర్వే నిర్వహించాలని కూడా ఇరువురు నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు.
మరోవైపు జనహిత పాదయాత్ర జరిగిన తీరు గురించి రేవంత్‌రెడ్డికి మహేశ్‌గౌడ్ వివరించారు. ఈ యాత్రలో ప్రభుత్వ పనితీరు గురించి సేకరించిన ప్రజాభిప్రాయాలను సీఎంకు తెలియజేశారు. ఈ నెల 23 తర్వాత రెండో విడత పాదయాత్ర ప్రారంభిస్తున్నానని.. వీలు చూసుకొని పాల్గొనాలని మహేశ్‌గౌడ్ విజ్ఞప్తి చేయగా రేవంత్ సానుకూలత వ్యక్తం చేశారని తెలిసింది. తనతోపాటు మంత్రివర్గం కూడా పాదయాత్రకు వస్తుందని ఆయన చెప్పినట్టు సమాచారం.