మెకానిక్ ఆదిలక్ష్మికి అండగా కవిత

MLC Kavitha Helps To women Mechanic Adilaxmi - Sakshi

ఇద్దరు ఆడపిల్లలను చదివిస్తానని భరోసా

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. లాక్‌డౌన్‌ కాలంలో ఎంతోమంది విద్యార్థులకు సాయం అందించిన కవిత.. తెలంగాణ తొలి మహిళా మెకానిక్ అదిలక్ష్మికి అండగా నిలిచారు. కష్టాల్లో ఉన్న కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.  కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు మెకానిక్ షాపు పెట్టిన ఆదిలక్ష్మికి వెన్నంటి నిలిచారు. కొత్త షాపునకు అత్యాధునిక మెషిన్లను అందిస్తానని, ఇద్దరు ఆడపిల్లలను చదివించే బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదంటూ నిరూపించిన మెకానిక్ ఆదిలక్ష్మికి అన్ని విధాలా తాను ఆదుకుంటానని కవిత భరోసా ఇచ్చారు. కాగా ఆదిలక్ష్మిపై గతవారం (జనవరి 26)న సాక్షి ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. (ఆదిలక్ష్మి గ్యారేజ్‌.. ఇచట అన్ని రిపేర్లు చేయబడును)

ఆదిలక్ష్మి నేపథ్యం.. 
సుజాతనగర్‌ మండల కేంద్రం ఖమ్మం ప్రధాన రహదారి పక్కనే రహదారి పక్కనే ఉంటుంది. ఓ టైర్‌ మెకానిక్‌ షెడ్డు. ట్రాక్టర్లు, లారీలు, పెద్ద పెద్ద చక్రాల బండ్లు అక్కడ ఆగుతాయి. ఓ మహిళ బయటకు వచ్చి సమస్య ఏమిటని తెలుసుకుంటుంది. పంచర్‌, టైర్‌ మార్పు.. పని ఏదైనా సరే చకచకా పని పూర్తి చేస్తుంది. భర్తతో పాటు షెడ్డు నడుపుకుంటూ కుటుంబానికి ఆసరా నిలుస్తుంది. ఆమె పేరు ఆదిలక్ష్మి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత అంజనానపురానికి చెందిన ఆదిలక్ష్మిది, ఆర్థికంగా నిరుపేద కుటుంబం. భర్త మెకానిన్‌గా పనిచేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషించేవాడు. అయినా.. జీతం సరిపోయేది కాదు.ఆర్థిక ఇబ్బందులకు తాళలేక కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకున్నది ఆదిలక్ష్మి. భర్తతో కలిసి ఏదైనా ఒక పని చేయాలని సంకల్పించుకుంది. అక్కడా ఇక్కడా అప్పు చేసి భార్యాభర్తలిద్దరూ సుజాతనగర్‌లో టైర్‌ వర్క్స్‌ షెడ్డు తెరిచారు. మెకానిక్ వర్క్ నేర్చుకుంటూ షెడ్డును తానే నడిపిస్తున్నది ఆదిలక్ష్మి. వాహనాలకు గ్రీజు పెట్టడం నుంచి వెల్డింగ్‌ పనులు, పంచర్‌ వేయటం వరకు అన్ని పనులూ చేస్తూ ఆదిలక్ష్మి శెభాష్‌ అనిపించుకుంటున్నది.

ఇప్పుడు తనే సొంతంగా కొత్త షాపు పెట్టుకోవాలని నిర్ణయించుకొని, సాయం కోసం ఎదురు చూస్తోంది.అయితే ఆదిలక్ష్మి చేస్తున్న కృషి గురించి తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత, నేరుగా మాట్లాడి అభినందనలు తెలిపారు.  అంతేకాదు కొత్త షాపు కోసం కావల్సిన అధునాతన మెషిన్లను అందజేస్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్ లోని నివాసంలో కవిత ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు కలిశారు. ఆది లక్ష్మి షాపునకు అత్యాధునిక మెషిన్లను అందిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు ఇద్దరు ‌కూతుర్లను ఉన్నత చదువులు చదివిస్తానని భరోసా ఇచ్చారు. మహిళలు ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలరని, ఆదిలక్ష్మి జీవితమే అందుకు నిదర్శనమని కవిత కొనియాడారు. అడగకుండానే సాయం చేసి, ఇద్దరు బిడ్డలను చదివిస్తానని హామీ ఇచ్చిన కవితకు ఆదిలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top