
సాక్షి, హైదరాబాద్: మిస్ వరల్డ్ పోటీల నిమిత్తం హైదరాబాద్‌కు విచ్చేసిన ప్రపంచ దేశాల అందాల భామలు.. ఇవాళ తెలంగాణ సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయం బ్యాక్ డ్రాప్‌లో గ్రూప్ ఫోటో దిగిన సుందరీమణులు.. తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరించారు. అత్యంత విశాలంగా.. అద్భుతమైన సెక్రటేరియట్‌ను చూసి ఆశ్చర్య వ్యక్తం చేసిన కంటెస్టెంట్లు.. సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. తెలంగాణ తల్లి ముందు ర్యాంప్ వాక్ చేశారు.
సెక్రటేరియట్ మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు ఏర్పాట్లు చేసిన హైటీలో సీఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అభివృద్ధి, సెక్రటేరియట్ నిర్మాణం, పథకాలను ఉద్దేశించి సీఎస్ ప్రసంగించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ పోటీలు అంటే కేవలం క్రీడ కాదన్నారు. మిస్ వరల్డ్ పోటీల వల్ల తెలంగాణ టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గత నాలుగు రోజులుగా ప్రపంచ అందగత్తెలు తిలకించారు. మిస్ వరల్డ్ పోటీలను తెలంగాణకు తెచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని జూపల్లి కృష్ణారావు అన్నారు.
కాగా, కంటెస్టెంట్లు ప్రయాణించే రహదారులన్నీ రంగురంగుల విద్యుద్దీపాలతో అలకరించారు. స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా అందాల భామలు సందర్శించారు. ఎన్టీఆర్ మార్గ్‌లో, బడా గణేష్ నిమజ్జనం జరిగే చోట తెలంగాణ చరిత్రకు అద్దంపట్టే సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా ఎన్టీఆర్ మార్గ్‌లో రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు కృష్ణజింకతో ఏర్పాటు చేసిన ఆర్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.