స్పీకర్‌దే తుది నిర్ణయం

Minister Vemula Prashanth Reddy not Inviting BJP To BAC Meeting - Sakshi

బీజేపీని బీఏసీ భేటీకి పిలువకపోవడంపై మంత్రి వేముల

ఢిల్లీ తరహాలో నగరంలో కానిస్టిట్యూషన్‌ క్లబ్‌ ఏర్పాటు 

సభ ముందుకు నాలుగైదు బిల్లులతో పాటు రెండు ఆర్డినెన్స్‌లు 

మంత్రి ప్రశాంత్‌రెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశానికి ముగ్గురు సభ్యులున్న బీజేపీని పిలవాలా వద్దా అనేది స్పీకర్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బీఏసీ సమావేశానికి హాజరు కావాలనుకుంటే బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. సోమవారానికి అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ కమిటీహాల్‌లో శుక్రవారం మీడియాతో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు.

ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు అసెంబ్లీ వేదికగా చెప్పుకుంటామని సీఎం కేసీఆర్‌ బీఏసీ భేటీలో వెల్లడించారన్నారు. ప్రతిపక్షాలు కోరినన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుత సమావేశాల్లో హరితహారం, దళితబంధు, ఐటీ, పరిశ్రమలు వంటి పది అంశాలను చర్చించాలని కోరుతూ స్పీకర్‌కు ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. 

12 అంశాలపై చర్చకు కాంగ్రెస్‌ ప్రతిపాదనలు 
ఈ సమావేశాల్లోనే నాలుగైదు బిల్లులతో పాటు రెండు ఆర్డినెన్స్‌లు కూడా సభ ముందుకు వస్తా యని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ 12 అంశాలపై చర్చించాలని ప్రతిపాదనలు ఇచ్చిందని, హైదరాబాద్‌ ఓల్డ్‌సిటీ అభివృద్ధిపై చర్చించాలని ఎంఐఎం పార్టీ కోరిందని పేర్కొన్నారు.

ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల కోసం కానిస్టిట్యూషన్‌ క్లబ్‌ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. టీఆర్‌ఎస్‌పై ఈటల రాజేందర్‌ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో బీజేపీయే తమకు ప్రధాన ప్రత్యర్థి అని, ఈ నెల 21,22,23 తేదీల్లో నిర్వహించిన సర్వేలో బీజేపీ కంటే టీఆర్‌ఎస్‌ పార్టీ 15% ఎక్కువ ఓట్లు సాధిస్తుందని వెల్లడైనట్లు మంత్రి తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top