
ఐఐటీ తరహా ప్రతిష్టాత్మక సంస్థతో డిజైన్ల తయారీ
నీటిపారుదల శాఖపై సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నిపుణుల కమిటీ సిఫారసులకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌ను ఏడాదిలోగా పునరుద్ధరిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన బరాజ్‌ల పునరుద్ధరణకు డిజైన్ల రూపకల్పనతోపాటు ఇతర సాంకేతిక అంశాల్లో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ)కు సహకారం అందించడానికి కన్సల్టెన్సీ సేవల కోసం ఇప్పటికే ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)ను ఆహ్వానించామన్నారు.
ఐఐటీ లేదా ఇతర ప్రతిష్టాత్మక సంస్థను కన్సల్టెంట్‌గా నియమించి.. డిజైన్ల రూపకల్పన, బరాజ్‌లకు జియోఫిజికల్, జియోటెక్నికల్ వంటి పరీక్షలతో పాటు పునరుద్ధరణ పనులు నిర్వహిస్తామని చెప్పారు. కుంగిపోయిన మేడిగడ్డ బరాజ్ 7వ నంబర్ బ్లాక్‌కు మరమ్మతులు నిర్వహించాలా? దానిని పూర్తిగా తొలగించి కొత్త బ్లాక్‌ను పునర్నిర్మించాలా? అనే అంశంపై సైతం కన్సల్టెన్సీ సహకారం తీసుకుంటామన్నారు. నీటిపారుదల శాఖపై మంగళవారం ఉత్తమ్ సచివాలయంలో సమీక్షించారు.
6 నెలల్లో కృష్ణా ట్రిబ్యునల్ విచారణ పూర్తి
ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ విషయంలో కేంద్రం జారీ చేసిన అదనపు మార్గదర్శకాలు (టరŠమ్స్ ఆఫ్ రిఫరెన్స్) ఆధారంగా జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 నిర్వహిస్తున్న విచారణ మరో ఆరు నెలల్లో పూర్తికావొచ్చని మంత్రి ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ వాదనలు పూర్తయిన తర్వాత రిజాయిండర్ వాదనలు వినిపించేందుకు సన్నద్ధం కావాలని అధికారులను ఆదేశించారు.
ప్రాణహితకు రెండు అలైన్‌మెంట్లు
ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మించి తీరుతామని మంత్రి ఉత్తమ్ అన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి 71.5 కి.మీ.ల గ్రావిటీ ద్వారా మైలారానికి నీటిని తీసుకొచి్చ, అక్కడి నుంచి 14 కి.మీ.ల సొరంగ మార్గం ద్వారా సుందిళ్ల బరాజ్‌కు నీటిని తరలించాలనే ఓ ప్రతిపాదన ఉందని చెప్పారు.
మైలారం వద్ద పంప్‌హౌస్ నిర్మించి అక్కడి నుంచి ఎల్లంపల్లి బరాజ్‌లోకి నీటిని ఎత్తిపోయాలనే మరో ప్రతిపాదనను సైతం పరిశీలిస్తున్నామన్నారు. ఈ రెండు అలైన్‌మెంట్లలో సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసి ఈ నెల 22లోగా సిఫారసు చేయాలని నీటిపారుదల శాఖ సలహాదారుడు ఆదిత్యనాథ్‌దాస్ నేతృత్వంలోని కమిటీని ఆదేశించారు.
త్వరలో ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణ
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనులు 2027 డిసెంబర్ 9లోగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ పునరుద్ఘాటించారు. వర్షాలు ముగిసిన వెంటనే పనులు ప్రారంభించాలని, ప్రతి 15 రోజులకోసారి పురోగతిని సమీక్షిస్తామన్నారు. సొరంగం తవ్వాల్సిన ప్రాంతంలో భూగర్భంలోని స్థితిగతులను తెలుసుకోవడానికి నిర్వహించనున్న హెలికాప్టర్ ఆధారిత సర్వేకు త్వరలో పౌర విమానయాన శాఖ డీజీ (డీజీసీఏ) నుంచి అనుమతులు వస్తాయన్నారు.
సమ్మక్కపై సీడబ్ల్యూసీ అనుమానాలను నివృత్తి చేయాలి
సమ్మక్క–సారక్క ప్రాజెక్టు కింద ప్రతిపాదించిన ఆయకట్టు విషయంలో సీడబ్ల్యూసీ లేవనెత్తిన అనుమానాలను సత్వరంగా నివృత్తి చేసి ఆ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులను పొందా లని అధికారులకు సూచించారు. దేవాదుల ప్రాజెక్టు ప్యాకే జీ–6 అంచనాల పెంపుతోపాటు అదనంగా మూడో దశ పనులకు అనుమతించామని చెప్పారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకుగాను తక్షణమే భూసేకరణకు రూ.33 కోట్లు విడుదల చేయాలన్నారు. సమీక్షలో శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, సలహాదారుడు ఆదిత్యనాథ్‌దాస్, ఈ ఎన్సీ (జనరల్) అంజాద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.