జగిత్యాల క్రైం: ఆరడుగుల నేల కోసం ఆఖరి నిమిషంలో ఎవరికీ భారం కాకూడదనుకున్నాడు. చావును కూడా ఒక పండుగలా, ముందే రాసిపెట్టుకున్న వీలునామాలా మార్చుకున్నాడు. తానొక రోజు వెళ్లిపోతానని తెలుసు.. అందుకే తాను నిద్రపోయే ’శాశ్వత గృహాన్ని’ పదిహేనేళ్ల ముందే నిర్మించుకున్నాడు. ఒక వృద్ధుని అంత్యక్రియలు.. ఆయన ఆశ పడిన చోటే, సొంతంగా కట్టుకున్న సమాధిలోనే జరిగాయి. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌లో శనివారం జరిగిన ఈ సంఘటన వివరాలివి.
దుబాయ్ వెళ్లి.. కంపెనీ స్థాపించి..
లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన నక్క ఇందయ్య (అలియాస్ జాన్) పెద్దగా చదువుకోకపోయినా, అసాధారణమైన ఆత్మవిశ్వాసం ఆయన సొంతం. ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఇందయ్య, అక్కడ కారి్మకుడిగా మిగిలిపోలేదు. తన కష్టార్జితంతో ఏకంగా ఒక కంపెనీనే స్థాపించి, ఎంతోమందికి అన్నం పెట్టాడు. కొన్నాళ్ల క్రితం తిరిగి గ్రామానికి వచ్చి పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు.
రూ.8 లక్షలతో రాతి సమాధి
ఇందయ్య ఆలోచనలు లోకానికి భిన్నం. మరణానంతరం తన పిల్లలకు భారం కాకూడదని, తన అంత్యక్రియల కోసం ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. ఆ నిశ్చయంతోనే 2009లో సుమారు రూ.8 లక్షల ఖర్చుతో గ్రామ శివారులోని సొంత భూమిలో రాతి సమాధిని నిర్మించుకున్నాడు. రోజూ సమాధిని సందర్శించి అక్కడ కాసేపు గడిపేవాడు. తన అంత్యక్రియలు అక్కడే చేయాలని కుటుంబ సభ్యులకు ముందే స్పష్టం చేశాడు. ఇందయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు సంతానం. పిల్లలకు పెళ్లి అయ్యింది. వారికి సంతానం కూడా ఉన్నారు.
కోరిక నెరవేరిన వేళ..
వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందయ్య, కరీంనగర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచాడు. తండ్రి చివరి కోరికను మన్నించి, ఆయన 15 ఏళ్ల క్రితం కట్టుకున్న ఆ రాతి సమాధి వద్దే అంత్యక్రియలు నిర్వహించారు. చదువుకోకపోయినా జీవిత సత్యాన్ని ఒంటబట్టించుకున్న ఈ ‘జాన్’కథ ఇప్పుడు ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.


