ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి | Minister Komatireddy Venkat Reddy fulfilled his promise | Sakshi
Sakshi News home page

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Oct 10 2026 3:59 PM | Updated on Oct 10 2026 4:27 PM

Minister Komatireddy Venkat Reddy fulfilled his promise
  • మూగ, చెవిటి దంపతుల బిడ్డకు అండగా నిలిచి.. మెరుగైన వైద్యం అందేలా చర్యలు
  • మరో 2 లక్షల ఆర్థికసాయం.. స్వయంగా వైద్యులతో మాట్లాడి శస్త్రచికిత్స చేయించిన మంత్రి
  • చిన్నారి భవిష్యత్తులో విద్యా బాధ్యతలూ తనవేనని భరోసా

హైదరాబాద్‌:  కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ భరోసా ఇవ్వడమే కాదు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఆ కుటుంబంలో ఆశలు నింపడమే నిజమైన మానవత్వం.  రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఓ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి, వారి చిన్నారికి మెరుగైన వైద్యం అందేలా స్వయంగా చొరవ తీసుకున్నారు.

రెండు రోజుల క్రితం వచ్చిన కుటుంబానికి తక్షణ సాయం..
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పనిగిరి గ్రామానికి చెందిన జంపాల మహేష్‌కుమార్‌, రజిత దంపతులిద్దరూ వినికిడి, మాటల సమస్యలతో బాధపడుతున్నారు. వారికి జన్మించిన బిడ్డ కూడా అదే సమస్యతో పుట్టడంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. చిన్నారికి సరైన వైద్యం అందిస్తే మాట్లాడే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల్లో ఆశ చిగురించింది. అయితే, చికిత్సకు లక్షల్లో ఖర్చవుతుందని తెలియడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ దంపతులు రెండు రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఆశ్రయించారు.

వారి ఆవేదనను అర్థం చేసుకున్న మంత్రి వెంటనే స్పందించి రూ.2 లక్షల తక్షణ ఆర్థికసాయం అందించారు. అంతటితో ఆగకుండా, చిన్నారికి మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులతో స్వయంగా మాట్లాడి అవసరమైన చికిత్స చేయిస్తానని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు.

ఇచ్చిన మాట ప్రకారం.. చిన్నారికి శస్త్రచికిత్స
బాధిత కుటుంబానికి ఇచ్చిన హామీ మేరకు మంత్రి చొరవ తీసుకుని హైదరాబాద్‌లోని కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రిలో చిన్నారిని చేర్పించి శస్త్రచికిత్స చేయించారు. శస్త్రచికిత్స పూర్తయిన అనంతరం మంత్రి నేడు ఆసుపత్రికి వెళ్లి చిన్నారిని ఆప్యాయంగా పలకరించి,కుటుంబ సభ్యులను పరామర్శించి,మరో 2లక్షలు ఆర్థికసాయం అందజేశారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

శస్త్రచికిత్స అనంతరం స్పీచ్ థెరపీ పూర్తిచేస్తే రానున్న కొన్ని నెలల్లో చిన్నారి మాట్లాడే అవకాశం ఉందని వైద్యులు వివరించారు. తమ బిడ్డకు మెరుగైన వైద్యం అందడంతో పాటు, భవిష్యత్తుపై ఆశలు చిగురించడంతో ఆ కుటుంబ సభ్యులు ఆనందభాష్పాలు పెట్టుకున్నారు. కష్టకాలంలో తమకు అండగా నిలిచి, బిడ్డకు చికిత్స చేయించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

బిడ్డ భవిష్యత్తుకూ భరోసా.. విద్యా బాధ్యతలు నావే
చిన్నారికి వైద్యం అందించడంతోనే తన బాధ్యత ముగిసిపోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. బిడ్డ భవిష్యత్తులో విద్యకు సంబంధించిన పూర్తి బాధ్యతలను తానే తీసుకుంటానని ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్నారి భవిష్యత్తుకు ఎలాంటి ఆటంకం కలగకుండా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడం,ఎంతో భవిష్యత్ ఉన్న ఓ చిన్నారి జీవితంలో కొత్త ఆశలు నింపడం, ఆ బిడ్డ భవిష్యత్తుకు భరోసా కల్పించడం.. ఇవే ప్రజాసేవకు నిజమైన అర్థమని పలువురు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సేవలు కొనియాడుతున్నారు.

 ఇదీ చదవండి: ‘జీవో 59’ దరఖాస్తులకు మోక్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement