
అసంఘటిత రంగ కార్మీకుల కనీస వేతన సవరణలో కోతల పర్వం
గతంలో ఇచ్చిన తుది ఉత్తర్వుల కంటే తక్కువగా వేతన ప్రతిపాదనలు
గతంలో ఏడు ఉద్యోగ కేటగిరీలుంటే.. ఇప్పుడు నాలుగు కేటగిరీలకే పరిమితం
పలు ఎంప్లాయిమెంటుల్లో భారీగా ఉద్యోగాలకు కోత పెడుతూ బోర్డు సిఫారసులు
కార్మీకుల సర్వీసు నిబంధనలకు సంబంధించిన ఫుట్‌నోట్‌లూ తగ్గింపు
త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి కనీస వేతన సలహా
మండలి ప్రతిపాదనలు భగ్గుమంటున్న కార్మిక సంఘాలు
సాక్షి, హైదరాబాద్: అసంఘటిత రంగ కార్మీకుల కనీస వేతన సవరణ ప్రక్రియలో ప్రతిచోటా కోతల పర్వం కొనసాగుతోంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన వేతన సవరణ తుది ఉత్తర్వుల్లో ఖరారు చేసిన ఉద్యోగాలు, వేతనాలకు సంబంధించి కత్తెర పడుతోంది. సర్వీసు నిబంధనల్లో భారీగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కార్మికుల కనీస వేతన సవరణ చివరిసారిగా 2006లో జరిగింది.
అప్పుడు చేసిన సవరణకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడేందుకు దాదాపు ఆరేళ్లు పట్టింది. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా వేతన సవరణ ఊసే లేదు. దీనిపై కార్మీక సంఘాలు తీవ్రస్థాయిలో ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక రాష్ట్రంలో ఏర్పాటైన మొదటి, రెండో కనీస వేతన సలహా బోర్డులు లోతుగా కసరత్తు చేసి గత ప్రభుత్వానికి వివిధ ఎంప్లాయిమెంట్లకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాయి.
వీటిపై గత ప్రభుత్వం కసరత్తు చేపట్టి ఐదు ఎంప్లాయిమెంట్లకు తుది ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ గెజిట్లు విడుదల కాకపోవడంతో అమలుకు నోచుకోలేదు. మరో 12 ఎంప్లాయిమెంట్లకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదించినా ఉత్తర్వులు వెలువడలేదు. మిగిలిన ఎంప్లాయిమెంట్లు ప్రతిపాదన దశలోనే ఉండిపోయాయి. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం 73 రకాల ఎంప్లాయిమెంట్లకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్లను గతేడాది జనవరి 29న జారీ చేయగా.. ఇప్పుడున్న కనీస వేతన సలహా బోర్డు తుది ప్రతిపాదనలు రూపొందిస్తోంది.
నాలుగు అంశాలు కొలిక్కి...
ఈ బోర్డు గతేడాది డిసెంబర్‌లో ఏర్పాటు కాగా.. అప్పట్నుంచి ఏడుసార్లు సమావేశమైంది. ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్లపై సుదీర్ఘంగా చర్చించి ఐదు ఎంప్లాయిమెంట్లకు సంబంధించి ప్రతిపాదనలను దాదాపు సిద్ధం చేసింది. ఇందులో నాలుగు రకాల అంశాలపై కీలకంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కార్మీకుల వేతనాలకు సంబంధించి బేసిక్ వేజ్, వీడీఏ ఖరారుతో పాటు, ఉద్యోగ హోదా (డిజిగ్నేషన్), సర్వీసు నిబంధనలకు సంబంధించిన ఫుట్ నోట్లను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది.
కట్.. కట్... కట్...
కనీస వేతన సలహా మండలి సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకున్న అంశాలపై కార్మీక సంఘాలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బోర్డు నిర్ణయాలు అధికారికంగా బహిర్గతం కానప్పటికీ.. చర్చించిన అంశాలు, మినిట్స్ తదితర సమాచారం బయటకు రావడంతో సంఘాలు భగ్గుమంటున్నాయి. కార్మిక సంఘాల ద్వారి తెలిసిన సమాచారం ప్రకారం.. కనీస వేతన సలహా బోర్డు సెక్యూరిటీ సర్వీసెస్, కన్‌స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, స్టోన్ బ్రేకింగ్ అండ్ స్టోన్ క్రషింగ్, కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ప్రైవేట్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ ఎంప్లాయిమెంట్స్‌కు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి.
ఫుట్ నోట్స్ కీలకం..
కార్మీకుల సర్వీసు నిబంధనల్లో ఫుట్ నోట్స్ కీలకం. ఈ ఫుట్‌నోట్స్ ఆధారంగా కార్మీకుడి గ్రేడ్ పెంచుతూ వేతనాలను సవరిస్తారు. ఉదాహరణకు ఒక కేటగిరీలో కార్మీకుడు ఐదేళ్లపాటు పనిచేస్తే ఆరో సంవత్సరం కార్మీకుడి గ్రేడ్ పెంచుతూ అధిక వేతనం ఇవ్వాలి. నైట్ షిఫ్ట్ అలవెన్సు 25 శాతం, రిస్క్ అలవెన్స్ 20 శాతం, అధిక ఎత్తులు, భూమి లోపల పనిచేసే వారికి అదనపు వేతనం జారీ తదితర నిబంధనలున్న ఫుట్ నోట్లను తగ్గించినట్లు సమాచారం. కన్‌స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎంప్లాయిమెంట్ 21 ఫుట్‌నోట్‌లను 5కు పరిమితం చేశారు. ఏకంగా 16 ఫుట్‌నోట్‌లు రద్దు చేశారు. ఇలా అన్ని సెక్టార్లలోనూ ఫుట్‌నోట్లకు కోత పడింది.
హైలీ స్కిల్డ్ వేతనంలో రూ.7,234 కోత
2021 జూన్‌లో ప్రభుత్వం ఐదు కేటగిరీలకు కనీస వేతనాలకు ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా బోర్డు ప్రతిపాదించిన వేతనాలను పరిశీలిస్తే గతంలో కంటే భారీగా కోత పెట్టినట్లు తెలుస్తోంది. హైలీ స్కిల్డ్ కేటగిరీలో రూ.7,234 కోత పడగా.. అన్‌స్కిల్డ్‌లో రూ.3,018 కోత పడింది. వాస్తవానికి రోజుకురోజు నిత్యావసర సరుకుల ధరలు, రోజువారీ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ఐదేళ్ల క్రితం నిర్దేశించిన వేతనాలకంటే 10 శాతం నుంచి 20 శాతం మేర కోత పెడుతూ బోర్డు ప్రతిపాదనలు తయారు చేయడంపై కార్మీక సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
భారీగా ఉద్యోగాల కోతలు
గతంలో హైలీస్కిల్డ్–1, 2, 3, 4, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కేటగిరీలుండగా... ఇప్పుడు వాటిని హైలీస్కిల్డ్, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కేటగిరీలకే పరిమితం చేశారు. 3 ఉద్యోగ కేటగిరీలు తొలగించడంతో ఉపాధి సంస్థల్లో భారీగా ఉద్యోగులు తగ్గిన ట్లేనని కార్మీక సంఘాలు అంటున్నాయి. సెక్యూరిటీ సర్వీసెస్ ఎంప్లాయిమెంట్‌లో 26 జూన్ 2021లో జారీ చేసిన జీఓఎంఎస్ 21 ప్రకారం 66 ఉద్యోగాలున్నాయి. గతేడాది విడుదలైన ప్రాథమిక నోటిఫికేషన్‌లో వీటి సంఖ్య 11కు తగ్గించారు.
వీటిని బోర్డు ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇక్కడే 55 ఉద్యోగాలకు కోత పడింది. అలాగే కన్‌స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎంప్లాయిమెంట్‌లో 611 ఉద్యోగాలను 58కి కుదించడంతో 533 ఉద్యోగాలకు కోతపడింది. స్టోన్ బ్రేకింగ్ అండ్ స్టోన్ క్రషింగ్ ఎంప్లాయి మెంట్‌లో 196 ఉద్యోగాలను 69కి కుదించారు. ఇలా ప్రతి ఎంప్లాయిమెంట్‌లో ఉద్యోగాల సంఖ్య తగ్గిస్తూ కనీస వేతన సలహా బోర్డు ప్రతిపాదనలు తుదిరూపుకు తెచ్చినట్లు సమాచారం. ఉద్యోగుల సంఖ్య కుదించడంతో ఉన్న కార్మికులపై పనిఒత్తిడి పడనుంది.