వీడియో కాల్‌ ద్వారా గర్భిణికి వైద్యం! | medical negligence in rangareddy district | Sakshi
Sakshi News home page

వీడియో కాల్‌ ద్వారా గర్భిణికి వైద్యం!

May 7 2025 7:02 AM | Updated on May 7 2025 7:02 AM

medical negligence in rangareddy district

 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్‌ నిర్వాకం 

 రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరిన బాధితురాలికి స్టాఫ్‌ నర్సు, ఆయాలతో వైద్యం చేయించిన వైనం 

చికిత్స వికటించి బయటపడిన గర్భసంచి సహా ఐదు నెలల కవల పిండాలు 

బంధువుల ఆందోళన.. ఆస్పత్రిని సీజ్‌ చేసిన అధికారులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఏడేళ్ల నిరీక్షణ తర్వాత గర్భం దాల్చిన ఓ ఇల్లాలి మాతృత్వపు కలను వైద్య నిర్లక్ష్యం విచ్ఛిన్నం చేసింది. గర్భస్థ పిండాల (మగ కవలలు) మృతికి కారణమై కాబోయే తల్లికి అంతులేని వేదనను మిగిల్చింది. తీవ్ర రక్తస్రావంతో ఆస్పత్రిలో చేరిన గర్భిణికి వాట్సాప్‌ వీడియో కాల్‌లో ఓ డాక్టర్‌ చేపట్టిన వైద్యం వికటించి ఐదు నెలల గర్భస్థ పిండాలు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. వైద్య నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగడంతో స్పందించిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని ఆస్పత్రిని సీజ్‌ చేశారు. 

పెళ్లయిన ఏడేళ్లకు ఐవీఎఫ్‌ ద్వారా గర్భం దాల్చి.. 
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తికి చెందిన కీర్తికి ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడుకు చెందిన బుట్టి గణేశ్‌తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. ఇప్పటివరకు పిల్లలు పుట్టకపోవడంతో చంపాపేటలోని ఓ సంతాన సాఫల్య కేంద్రాన్ని సంప్రదించారు. అక్కడి చికిత్సలతో చివరకు ఇన్‌ విట్రో ఫెర్టిలైజేషన్‌ (ఐవీఎఫ్‌) పద్ధతిలో ఐదు నెలల క్రితం కీర్తి గర్భం దాల్చింది. తొలి మూడు నెలలు చంపాపేట ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకున్న ఆమె తరచూ అక్కడకు వచ్చి వెళ్లడం ఇబ్బందిగా మారడంతో ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్‌ అనూషరెడ్డిని సంప్రదించారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించిన మహిళా డాక్టర్‌... కీర్తి గర్భసంచి వదులుగా ఉన్నట్లు గుర్తించి ఏప్రిల్‌ 6న కుట్లు వేసింది. అయితే అప్పటి నుంచే బాధితురాలికి రక్తస్రావం మొదలైంది. తరచూ ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడంతోపాటు మందులు తీసుకొని ఇంటికి వెళ్తోంది. 

ఇంటి నుంచే చికిత్స అందించడంతో.. 
ఆదివారం తెల్లవారుజామున కీర్తి రక్తస్రావంతోపాటు భరించలేని నొప్పులతో బాధపడుతుండటంతో చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఉదయం 5:45 గంటలకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆస్పత్రిలో డాక్టర్‌ అనూషరెడ్డి లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెకు సమాచారం అందించారు. అయినా వైద్యురాలు ఆస్పత్రికి రాకుండా ఇంటి నుంచే వాట్సాప్‌ వీడియో కాల్‌ ద్వారా స్టాఫ్‌నర్సు, ఆయాలతో చికిత్స ప్రారంభించింది. 

స్టాఫ్‌ నర్సు, ఆయాలకు అనుభవం లేకపోవడం, అప్పటికే పరిస్థితి విషమించడంతో గర్భ సంచి సహా గర్భంలోని కవల పిండాలు బయటకొచ్చేశాయి. వైద్యురాలి నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందంటూ బాధితురాలి బంధువులు సోమవారం ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలియగానే పోలీసులు, జిల్లా వైద్యాధికారులు ఆస్పత్రికి చేరుకొని సీజ్‌ చేశారు. ఆస్పత్రిలోని ముగ్గురు బాలింతలను వనస్థలిపురంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వైద్యురాలిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ తర్వాత వదిలేశారు.

నిర్లక్ష్యం లేదన్న ఆస్పత్రి.. 
అధిక రక్త స్రావంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన తల్లి ప్రాణాలను కాపాడేందుకు అప్పటికే గర్భంలో మృతి చెందిన కవల పిండాలను అబార్షన్‌ ద్వారా తొలగించాల్సి వచి్చందని.. ఇందులో ఎలాంటి వైద్య నిర్లక్ష్యం లేదని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. మానవతా దృక్పథంతో చికిత్స అందించామని.. ఆస్పత్రి బిల్లు చెల్లించడం ఇష్టంలేకే కుటుంబ సభ్యులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆ వర్గాలు పేర్కొనడం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement