మేడారం(ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌తాడ్వాయి): రక్షించే తల్లికి రహస్య పూజలు. అండగా నిలిచే అమ్మకు హనుమంతుడి జెండా నీడలు. సల్లని తల్లికి నీళ్లారగింపులు.. మహిమగల్ల మాతకు మంగళహారతులు. హోరెత్తించే డోలు వాయిద్యాలు. ప్రొటోకాల్‌కు పోలీసుల వలయాలు. పసిడి వెన్నెలమ్మకు పొర్లు దండాలు.. వరంపట్టిన భక్తులకు శతకోటి వరాలు. జంపన్నవాగులో తడిసిన పాదాలు.. తమ్ముడు జంపన్నకు దీవెనార్తులు. గద్దెపై కొలువుదీరిన సారలమ్మకు జయజయధ్వానాలు..
కన్నెపల్లి నుంచి సారలమ్మ బుధవారం అర్ధరాత్రి తర్వాత మేడారం గద్దెపై కొలువుదీరింది. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, పూజారులు కాక వెంకటేశ్వర్లు, కిరణ్, భుజంగరావు, అమృత, కనకమ్మతోపాటు మరికొంత మంది గుడిలో రహస్య పూజలు చేశారు. హనుమాన్ జెండా నీడలో అమ్మవారిని గుడి నుంచి బయటకు తీసుకొచ్చారు. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టీఎస్, ములుగు జిల్లా ఎస్పీ రాంనాథ్ కేకన్, జాతర చైర్‌పర్సన్ ఇర్ప సుకన్యతోపాటు ఆదివాసీ యువకులు, మహిళలతో కలిసి సారలమ్మ యాత్ర కొనసాగింది. గ్రామంలోని ఆడబిడ్డలు అమ్మవారికి ఎదురెల్లి నీళ్లు ఆరగించి మంగళహారతులు పట్టారు. అమ్మవారిని తీసుకుని డోలు వాయిద్యాలతో ఆదివాసీలు, పోలీసుల రోప్ పార్టీ బందోబస్తు మధ్య అధికారంగా యాత్ర కొనసాగింది.

దారి పొడవునా దండాలు..
కన్నెపల్లి నుంచి సారలమ్మ బయల్దేరడంతో భక్తులు అమ్మవారి పాద స్పర్శ కోసం వరం పడుతూ నేలపై బోర్లా పడుకున్నారు. తల్లిని కనులారా చూసేందుకు మేడారం గద్దెల వరకు భక్తులు బారులుదీరారు. అమ్మకు జేజేలు అంటూ పసుపును పైకి చల్లారు. సారలమ్మను జంపన్నవాగులో నుంచి తీసుకెళ్లారు. జంపన్నవాగుపై రెండు బ్రిడ్జిలు ఉన్నప్పటికీ ఆనవాయితీగా అక్క సారలమ్మ కాళ్లను తమ్ముడు జంపన్న తాకి నమస్కరించినట్లుగా భావించి జంపన్న వాగులో నుంచి మాత్రమే సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చారు. అక్కడి నుంచి తల్లి సమ్మక్క గుడిలోకి వెళ్లి అక్కడ పసుపు కుంకుమ్మ సమర్పించి సారలమ్మ పీఠంపై చీర, రవికను అందించారు. అప్పటికే పగిడిద్దరాజు, గోవిందరాజులు సమ్మక్క గుడి వద్దకు చేరుకున్నారు. ఇందులో భాగంగా పెళ్లి కొడుకుగా వచ్చిన పగిడిద్దరాజుకు సమ్మక్క గుడిలో పెళ్లి క్రతువు సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ పెళ్లిని సారలమ్మ, గోవిందరాజులు తిలకించి పగిడిద్దరాజుతో కలిసి గద్దెలపై కొలువుదీరారు.

కొలువుదీరే ముందు ప్రత్యేక పూజలు
సారలమ్మ ఆలయం నుంచి పసుపు, కుంకుమ, పవిత్రమైన నీటిని తీసుకొని పూజారులు ఆడపడుచులు కలిసి మేడారంలోని సారలమ్మ గద్దెకు చేరుకొని అలికి ముగ్గులు వేశారు. అనంతరం అమ్మవారి ధ్వజస్తంభానికి కంకణాలు కట్టారు. భక్తులెవరూ చూడకుండా చీర చుట్టి పూజలు చేశారు. సాయంత్రం సారలమ్మను గద్దెపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. సమ్మక్క పూజారులు, ఆడపడుచులు కూడా మేడారంలోని సమ్మక్క గుడి నుంచి పసుపు, కుంకుమతో సమ్మక్క గద్దె వద్దకు చేరుకున్నారు. నేడు (గురువారం) సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దెపై రావడానికి ముందుగా పూజారులు సమ్మక్క గద్దెను మట్టితో అలికి ముగ్గులతో అలంకరించారు.


