ప్రైవేటు ఆస్పత్రుల నుంచి డబ్బు రిఫండ్‌కు చర్యలు  | Measures For Refund Of Money From Private Hospitals Telangana | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఆస్పత్రుల నుంచి డబ్బు రిఫండ్‌కు చర్యలు 

Jun 4 2021 2:27 AM | Updated on Jun 4 2021 9:33 AM

Measures For Refund Of Money From Private Hospitals Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధిక ఫీజుల వసూలు ఆరోపణలకు సంబంధించి ఆస్పత్రులు, రోగులతో చర్చించి బాధితులకు రిఫండ్‌ చేసే విషయంలో చర్యలు తీసుకోవాలని హైకోర్టు చేసిన సూచనల ప్రకారం నడుచుకుంటామని వైద్య,ఆరోగ్య శాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పా టు చేసి, ఆస్పత్రులతో చర్చించి డబ్బులు రిఫండ్‌ చేసేలా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. గురువారం వైద్య విద్య డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డితో కలసి మాట్లాడుతూ.. అధిక ఫీజుల వసూలుపై మొత్తం 12 జిల్లాల్లో 185 ఫిర్యాదులు వచ్చాయన్నారు.

ఆపదలో ప్రాణాలు కాపాడాలంటూ పేదలు ప్రైవేటు ఆస్పత్రులకు వస్తారని, డిశ్చార్జి చేసేట ప్పుడు వారి ఆర్థిక స్థితిని గమనించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం చార్జీలు వసూలు చేయాలని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే తీవ్ర చర్యల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. ఇప్పటికే 22 ఆస్పత్రులపై చర్యలు చేపట్టిన విషయం గుర్తు చేశారు.  

పట్టణాల్లో కేసులు తగ్గుముఖం 
ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు కనీసస్థాయిలో ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే వారం, 10 రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లోనూ కేసుల సంఖ్య తగ్గించగలిగితే ప్రభుత్వం లాక్‌డౌన్‌ నుంచి వెసులుబాటు కల్పించే అవకాశాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం కోవిడ్‌ ఉధృతి, తీవ్రతలో మరింత తగ్గుదల మొదలైందని తెలిపారు. అయితే ప్రజలు కూడా కోవిడ్‌ నియంత్రణ వైఖరి కొనసాగించాలని, లాక్‌డౌన్‌ సడలింపు సందర్భంగా కూడా జాగ్రత్తలు పాటించాలన్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో థర్డ్‌వేవ్‌ కేసులు ప్రారంభమైనట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో మనం తీసుకుంటున్న జాగ్రత్తలే కుటుంబసభ్యులకు శ్రీరామ రక్ష అని వివరించారు.  

లాక్‌డౌన్‌తో మంచి ఫలితాలు.. 
లాక్‌డౌన్‌తో మంచి ఫలితాలొస్తున్నాయని, లాక్‌డౌన్‌కు పూర్వం 52 శాతం ఉన్న బెడ్‌ ఆక్యుపెన్సీ ఇప్పుడు 26 శాతానికి తగ్గిందన్నారు. పట్టణ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు అవుతోందని, అయితే గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంకొంచెం పకడ్బందీగా అమలు చేసుకోవాలని చెప్పారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న పొరుగు రాష్ట్రాల నుంచి ప్రజల రాకపోకలే మన రాష్ట్రంలో కేసులు పెరగడానికి కారణమవుతున్నాయి. ఇప్పటికే సత్తుపల్లి, మధిర, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటించామని, శుక్రవారం గద్వాల, ఆలంపూర్, మక్తల్‌లో పర్యటిస్తామన్నారు. ఇంటింటి సర్వే మొదటి దశ రాష్ట్రవ్యాప్తంగా ముగిసిందని పేర్కొన్నారు. 

వెయ్యి సెంటర్ల ద్వారా సెకండ్‌ డోస్‌! 
వ్యాక్సినేషన్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వెయ్యిసెంటర్ల ద్వారా సెకండ్‌ డోస్‌ ఇస్తున్నట్లు, హైరిస్క్‌ వారికి జీహెచ్‌ఎంసీలోని 30పైగా కేంద్రాల్లో 30 వేల మందికి పైగా వ్యాక్సిన్లు వేసే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. చదువుకునేందుకు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు హైదరాబాద్‌లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌లో జూన్‌ 5 నుంచి ఉచితంగా వ్యాక్సిన్‌ ఇస్తామని చెప్పారు. జూన్‌ 4 నుంచి వైద్య శాఖ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. బ్లాక్‌ఫంగస్‌ చికిత్సకు సంబంధించి ఈఎన్‌టీ, గాంధీ ఆస్పత్రుల్లో మంచి వైద్యం అందుబాటులో ఉందని వైద్య విద్య డైరెక్టర్‌ రమేశ్‌రెడ్డి తెలిపారు. 

త్వరలో జర్నలిస్టు కుటుంబీకులకూ వ్యాక్సిన్‌ 
జర్నలిస్టుల కుటుంబసభ్యులకూ వచ్చే వారంలో వ్యాక్సిన్‌ పంపిణీ చేయనున్నట్లు శ్రీనివాస్‌రావు చెప్పారు. హైదరాబాద్‌ జర్నలిస్టు యూనియన్‌ (హెచ్‌యూజే) అధ్యక్షుడు ఇ.చంద్రశేఖర్, కార్యదర్శి కె.నిరంజన్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం శ్రీనివాస్‌రావును కలసి వినతి పత్రం సమరి్పంచారు. జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించిందని పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement