అమ్మ లేదని.. ఇక తిరిగి రాదని తెలియక.. | married woman road incident in Mahabubabad | Sakshi
Sakshi News home page

అమ్మ లేదని.. ఇక తిరిగి రాదని తెలియక..

Jun 17 2025 11:35 AM | Updated on Jun 17 2025 11:53 AM

married woman road incident in Mahabubabad

బస్సును ఢీకొన్న ఆటో.. మహిళ దుర్మరణం

భజన తండా సమీపంలో ఘటన   

మేకను కొనేందుకు వెళ్తూ.. మృత్యుఒడికి

మహబూబాబాద్‌ రూరల్‌ : మేకను కొనేందుకు వెళ్తున్న క్రమంలో ఓ మహిళ మృత్యుఒడికి చేరింది. బస్సును ఆటో ఢీకొన్న ఘటనలో దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం సోమవారం మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధి బేతోలు శివారు భజన తండా సమీపంలో చోటుచేసుకుంది.. పోలీసులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. 

జిల్లాలోని బయ్యారం మండలం జగత్‌ రావు పేట జీపీ పరిధిలోని బోటి తండాకు చెందిన మాలోత్‌ సురేశ్, అతడి అన్న గణేశ్, వదిన అమలాదేవి (27), వారి ఇద్దరు కుమారులు నాలుగేళ్ల గౌతమ్, ఏడాదిన్నర వయసుగల గగన్, అక్కాబావ బానోత్‌ రంగ్య, మంజుల ఓ ఆటోలో కురవి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధి బేతోలు శివారు భజన తండా దాటుతుండగా ముందునుంచి వెళ్తున్న ఆర్టీసీ బస్సు సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఆ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో అమలాదేవికి తీవ్ర, మిగతా వారందరికీ స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న 108 వాహనం క్షతగాత్రులను ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. 

అమలాదేవిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందిందని ధ్రువీకరించారు. కాగా, మంగళవారం తమ ఇంటి వద్ద ఎల్లమ్మ పండుగ చేసుకోనున్న నేపథ్యంలో కురవిలోని అంగడిలో మేకను కొనుగోలు చేయడానికి వారంతా ఆటోలో వెళ్తున్నట్లు బంధువులు పేర్కొన్నారు. కుమారులు గౌతం, గగన్‌.. తల్లి అమలాదేవి కనిపించకపోవడంతో వెక్కివెక్కి ఏడుస్తుండగా వారిని ఆపడం ఎవరితరం కాలేదు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కురవి ఎస్సై గండ్రాతి సతీశ్, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement