
నాగోలు(హైదరాబాద్): భర్త వేధింపుల కారణంగా ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్‌బీనగర్ పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.ఖమ్మం పట్టణానికి చెందిన కట్టా వెంకటేశ్వర్లు కుమార్తె జాస్మిన్(29)కు ఎల్‌బీనగర్, శివపురి కాలనీ చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పెండెం రాజశేఖర్‌తో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 25 లక్షల నగదు, 20 తులాల బంగారం కట్నంగా ఇచ్చారు.
వివాహం జరిగిన కొన్నాళ్లకే రాజశేఖర్, అతడి కుటుంబ సభ్యులు జాస్మిన్‌ను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్ద మనుషులు ఆమెకు నచ్చజెప్పి కాపురానికి పంపించారు. అయినా తన వైఖరి మార్చుకోని రాజశేఖర్ కొన్నాళ్లకే జాస్మిన్‌ను కొట్టి పుట్టింటికి పంపించాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రాజశేఖర్‌ను పిలిపించిన పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. మంగళవారం ఆఫీస్‌కు వెళ్లిన రాజశేఖర్ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూడగా లోపలి నుంచి గడియపెట్టి ఉంది. జాస్మిన్‌ను పిలిచినా స్పందన లేకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు పగలకొట్టి చూడగా జాస్మిన్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. కిందకు దింపి చూడగా అప్పటికే ఆమె మృతి చెంది ఉంది.

దీంతో అతను ఎల్‌బీనగర్ పోలీసులు, జాస్మిన్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. జాస్మిన్ శరీరంపై గాయాలను గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు రాజశేఖర్ ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. మృతురాలి తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.