లైంగిక వేధింపులతో బాలికా విద్య బుగ్గి
మూడేళ్లలో 1,220 మంది చదువుకు దూరం.. కేసుల దాకా వెళ్లనివి ఈ సంఖ్యకు 3–4 రెట్లు ఎక్కువే
కౌన్సెలింగ్ తర్వాత 595 మంది తిరిగి పాఠశాలలకు..
దాడి తర్వాత విద్యారి్థనులను వెంటాడుతున్న భయం
భరోసా ఇవ్వలేని రక్షణ వ్యవస్థలు
పెద్దింటి బిడ్డలకు పోలీసుల వత్తాసు
స్టేషన్ మెట్ల దగ్గరే కేసు క్లోజ్
సాక్షి, హైదరాబాద్: బాలికలపై లైంగిక వేధింపులు..వారి సామాజిక జీవితం..మానసిక స్థైర్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ధైర్యంగా ఎదుర్కొనే శక్తి చిన్నారులకు ఉన్నా, సమాజం వెక్కిరింతలు వారిని విద్యకు దూరం చేస్తున్నాయి. తెలంగాణ పోలీసులు ఈ అంశంపై వెల్లడించిన అంశాలు తీవ్ర ఆందోళన కలిగించేలా ఉన్నాయి. గడచిన మూడేళ్లలో లైంగిక దాడులకు గురైన పిల్లల్లో 1,220 మంది కొన్నేళ్ల పాటు విద్యా సంస్థల మొహం చూసేందుకే సాహసించలేదు. వారి తల్లిదండ్రులూ ఆ చిన్నారులను స్కూళ్లకు పంపేందుకు ఇష్టపడలేదు.
ఇలాంటి వారిని గుర్తించి సామాజిక వేత్తలు, పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉంటోంది. లైంగిక వేధింపులు లేదా లైంగిక దాడులకు గురైన పిల్లల కేసులను సమీక్షించిన అనంతరం, వారి విద్యా స్థితిని ఒక్కొక్క కేసు ఆధారంగా పోలీసులు పరిశీలించారు. చాలా మంది విద్యారి్థనులు ఏదో తప్పు జరిగినట్టుగా, సమాజంలో తలెత్తుకొని ఎలా తిరగాలి అన్నట్టుగా బాధపడటం కనిపించింది.
ఊరు దాటని నిజం
గ్రామీణ పాఠశాలల్లోనే విద్యార్థినులు ఎక్కువగా విద్యకు దూరమవుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, సమన్వయం, పర్యవేక్షణ లోపాలు ఉండటం పరిస్థితిని మరింత పెంచుతోంది. మౌలిక వసతులు కూడా లేని పాఠశాలల్లో శౌచాలయానికి వెళ్లే క్రమంలోనే ఎక్కువ లైంగిక వేధింపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రైవేటు పాఠశాలల్లో రక్షణ లేని రవాణా వ్యవస్థ, బస్సు, ఆటో డ్రైవర్లు మద్యం సేవించడం వంటి సందర్భాల్లో లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.
తోటి విద్యార్థుల నుంచి ఇలాంటి పరిస్థితి ఎదురైనా వాటిని ఊరులోనే పరిష్కరించుకోవాలనే ధోరణిని స్థానికులు అలవాటు చేస్తున్నారు. గడిచిన మూడేళ్లల్లో కనీసం 3 వేలకుపైగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా, అవి పోలీస్‌స్టేషన్ల స్థాయికి కూడా చేరుకోలేదు. ఎవరో ఒకరు రంగంలోకి దిగడం రాజీ కుదర్చడంతోనే సరిపోతోంది. ఆ తర్వాత బాలికను పెళ్లి చేసి పంపిస్తే సరిపోతుందని గ్రామీణ ప్రాంత తల్లిదండ్రులు ఆలోచిస్తున్నట్టు మహిళా సమాఖ్యలు చెబుతున్నాయి.
ఏటా పెరుగుదల
లైంగిక వేధింపులు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం 2024లో 300 మంది బాధిత పిల్లలు చదువుకు దూరమయ్యారు. 2025లో ఈ సంఖ్య 515కు పెరిగింది. 2026లో ఇప్పటివరకు 405 మంది విద్యకు దూరమైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. అంటే మూడు సంవత్సరాల్లో మొత్తం 1,220 మంది. ఇదే కాలంలో 2024లో 148 మంది, 2025లో 191 మంది, 2026లో 256 మంది తిరిగి విద్యలో చేరారు. మొత్తం 595 మంది తిరిగి బడిబాట పట్టారు. అయినా 449 మంది ఇంకా పాఠశాల వెలుపలే ఉన్నారు. ఇవన్నీ అధికారికంగా నమోదైన వివరాలు మాత్రమే.
ఇంతకు మూడు రెట్లు వాస్తవ డేటా నమోదు అవుతున్నట్టు సమాచారం. 9వ తరగతి నుంచి ఆపైన చదివే బాలికల విషయంలో జరిగిన ఘటనను బయటకు చెప్పేందుకు కూడా తల్లిదండ్రులు ముందుకు రావడం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. లైంగిక దాడి తర్వాత బాలికల మనసులో ఏర్పడే భయం, అవమాన భావన, సామాజిక ముద్ర, ఒంటరితనం చదువు కొనసాగించడంలో ప్రధాన అడ్డంకులుగా అధికారులు గుర్తించారు. గత మూడేళ్లలో సుమారు 7,695 మంది లైంగిక దాడి బాధితులకు భరోసా కేంద్రాల ద్వారా సహాయం అందినట్టు పోలీసుల సమాచారం. కౌన్సెలర్లు, పోలీసులు బాధితులతో క్రమం తప్పకుండా మాట్లాడటం, వారి మానసిక స్థితిని పర్యవేక్షించడం, కేసు విచారణ పూర్తయ్యే వరకు ఫాలోఅప్ చేయడం వంటి చర్యలు చేపడుతున్నారు.
విశ్వాసం పెంచాలి
లైంగిక దాడి జరిగిన బాలికల్లో ముందుగా ఆత్మవిశ్వాసం పెంచాలి. సమాజంలో ఎదురయ్యే ఘటనలను ఎదుర్కొనేలా చేయాలి. తప్పు తనది కాదని, ఎవరో చేసిన దానికి తామెందుకు శిక్ష అనుభవించాలనే భావన వారిలో తేవాలి. వీధి వెంట వెళుతుంటే కుక్క కాటేస్తుంది. మందు తీసుకొని తిరిగి జీవనం సాగిస్తాం. ఇదే అంతే అనే భావన తేవాలి.
– : డాక్టర్ అనితా అరె, సైకాలజిస్ట్
సామాజిక కౌన్సిలింగ్ అవసరమే
బాధిత బాలికల్లో నూన్యత భావం లేకుండా చేయడం ఒక ఎత్తు. అసలీ ఘటనలు లేకుండా చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నామనేది ముఖ్యమైన అంశం. లైంగిక దాడిని సీరియస్‌గా తీసుకోవాలి. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయనే వాస్తవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సామాజిక కౌన్సిలింగ్ అతి ముఖ్యం. – కల్వకుంట్ల శ్రీలతారావు, టీచర్, వినాయకగూడెం, కరీంనగర్


