భారీగా పెట్టుబడులు.. 42,000 కొలువులు 

Many famous companies have come forward to invest in various fields - Sakshi

వివిధ రంగాల్లో పెట్టుబడులకు ముందుకొచ్చిన పలు దిగ్గజ సంస్థలు 

80కి పైగా వాణిజ్య సమావేశాలు, రెండు సదస్సుల్లో పాల్గొన్న కేటీఆర్‌ 

విదేశీ గడ్డపై తెలంగాణ సాధించిన జలవిజయం ఆవిష్కరణ 

ప్రవాస భారతీయ సీఈవోలతోనూ భేటీ 

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటన విజయవంతం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు యూకే, యూఎస్‌ పర్యటన గురువారంతో ముగిసింది. రెండు వారాలపాటు సాగిన పర్యటనలో 80కిపైగా వాణిజ్య సమావేశాలు, ఐదు రంగాలకు సంబంధించి రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, రెండు సదస్సుల్లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను కేటీఆర్‌ ఆకర్షించగలిగారు. తద్వారా తెలంగాణలో సుమారు 42 వేల ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమమైంది. 

వార్నర్‌ బ్రదర్స్‌ మొదలు జ్యాప్‌కామ్‌ వరకు.. 
లండన్, న్యూయార్క్, వాషింగ్టన్‌ డీసీ, హ్యూస్టన్, హెండర్సన్, బోస్టన్‌ నగరాల్లో జరిగిన కేటీఆర్‌ వివిధ సంస్థల ప్రతినిధులతో చేపట్టిన వాణిజ్య సమావేశాల్లో భారీ పెట్టుబడులకు సంబంధించిన ప్రకటనలు వెలువడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, బీమా, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, ఏరోస్పేస్, రక్షణ, లైఫ్‌ సైన్సెస్, మెడికల్‌ డివైసెస్, డిజిటల్‌ సొల్యూషన్స్, డేటా సెంటర్స్‌ తదితర రంగాల్లో అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడుల ప్రకటనలు వచ్చాయి. తద్వారా 42 వేల ప్రత్యక్ష ఉద్యోగాలతోపాటు పరోక్షంగా మరో 3–4 రెట్లు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో భారీ పెట్టుబడులు ప్రకటించిన సంస్థల జాబితాలో వార్నర్‌ బ్రదర్స్, డిస్నీ, మెడ్‌ట్రోనిక్, స్టేట్‌ స్ట్రీట్, లండన్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ గ్రూప్, టెక్‌ ఎఫ్‌ఎంసీ, ఆలియంజ్‌ గ్రూప్, స్టెమ్‌ క్యూర్స్, జ్యాప్‌కామ్‌ తదితర సంస్థలు ఉన్నాయి. వాణిజ్య సమావేశాలతోపాటు రెండు ప్రధాన సదస్సులోనూ మంత్రి కేటీఆర్‌ ప్రసంగించారు. లండన్‌లో ఈ నెల 12న ‘ఐడియాస్‌ ఫర్‌ ఇండియా’సదస్సులో తెలంగాణ మోడల్‌ను కేటీఆర్‌ వివరించారు.

ఆ తర్వాత ఈ నెల 15న కొంగరకలాన్‌లో జరిగిన ఫాక్స్‌కాన్‌ కంపెనీ శంకుస్థాపనకు వచ్చిన కేటీఆర్‌... ఆ వెంటనే అమెరికా టూర్‌కు వెళ్లారు. ఈ నెల 22న హెండర్‌సన్‌లో జరిగిన సదస్సులో అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ సదస్సులో కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరథ పథకం ద్వారా తెలంగాణ సాధించిన జలవిజయాన్ని ఆవిష్కరించారు. తెలంగాణలో 9 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించారు.

అలాగే రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఎన్నారై సీఈఓలతో జరిగిన సమావేశంలో కేటీఆర్‌ వివరించారు. కేటీఆర్‌ వెంట వెళ్లిన ప్రతినిధి బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్, పెట్టుబడుల ప్రోత్సాహక విభాగ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, తెలంగాణ డిజిటల్‌ మీడియా వింగ్‌ డైరెక్టర్‌ దిలీప్‌ కొణతం తదితరులు ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top