వామ్మో ఒక్క కిలోకే అంత ధర! పచ్చడి పెట్టలేం.. పండ్లు తినలేం!

Mango Yield Goes Down Prices Shoot Up Batasingaram Market In Hyderabad - Sakshi

పడిపోయిన మామిడి దిగుబడి  

అమాంతం పెరిగిన ధరలు   

సాక్షి, రంగారెడ్డిజిల్లా: మధుర ఫలం పులుపెక్కింది. ఇటు పచ్చడి నిల్వ చేసుకోవాలనుకునే వారికి.. అటు పండ్ల రుచిని ఆస్వాదించాలనుకున్న వారికి నిరాశే మిగులుతోంది. కొత్తపేట పండ్ల మార్కెట్‌కు గతంలో రోజుకు 1000 టన్నుల మామిడి రాగా, ప్రస్తుతం బాటసింగారం మార్కెట్‌కు 600 టన్నులకు మించి రావడం లేదు. టన్ను ధర (కాయ సైజును బట్టి) రూ.90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు పలుకుతోంది.

నాలుగు రోజుల క్రితం రికార్డుస్థాయిలో రూ.1.24 లక్షలు పలకడం విశేషం. డిమాండ్‌ మేర దిగుమతి లేకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో ధరలు అమాంతం పెరిగిపోయాయి. పండ్లరసాలు కిలో రూ.150–200 వరకు విక్రయిస్తుండగా, పచ్చడి కాయలు సైజును బట్టి ఒక్కోటి రూ.15–20 చొప్పున అమ్ముతుండటం గమనార్హం.   
(చదవండి: పిత్తాశయంలో రాళ్లెందుకు వస్తాయి?  పరిష్కారాలేమిటి? )

మార్కెట్‌కు తగ్గిన సరఫరా 
బాటసింగారం మార్కెట్‌ నుంచి మామిడి సహా ఇతర పండ్లు సరఫరా అవుతుంటాయి. రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం సహా ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర శివారు జిల్లాలకు చెందిన రైతులు తమ ఉత్పత్తులను ఇక్కడికే తెచ్చి అమ్ముతుంటారు. ప్రస్తుత సీజన్‌లో ఆయా జిల్లాల నుంచి రోజుకు సగటున వెయ్యి టన్నులకుపైగా మామిడి రావాల్సి ఉండగా, 500 టన్నుల లోపే వస్తోంది.

పచ్చడిలో ఉపయోగించే పుల్లటి మామిడి కాయలే కాదు బంగినపల్లి, తోతాపురి, చెరుకురసం, సువర్ణ రేఖ, నీలం రకాల మామిడి పండ్లు కూడా రావడం లేదు. సాధారణంగా మార్చి చివరి నాటికి మార్కెట్లను ముంచెత్తాల్సిన ఫలరాజం ఏప్రిల్‌ రెండో వారంలోనూ         ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు.   

ఇటు మామిడి.. అటు నిమ్మ 
వాతావరణ మార్పులతో మామిడి పూత, కాత తగ్గి దిగుబడులపై ప్రతికూల ప్రభావం చూపినట్లు తెలంగాణ రాష్ట్ర కొండా లక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం అధ్యయనంలో తేలింది. చలికాలంలో భారీ వర్షాలు కురవడం.. రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోవడం.. ఫిబ్రవరి నుంచి ఎండలు మండిపోవడం.. మార్చిలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పూత ఎండి పిందె రాలిపోయింది. గతంలో ఒక నిమ్మ చెట్టుకు ఐదు నుంచి ఆరు బస్తాల కాయలు వచ్చేవి.

చీడపీడల కారణంగా ఈసారి ఒకటి రెండు బస్తాలకే పరిమితమైంది. వ్యవసాయ మార్కెట్లో బస్తా రూ.2,500 పైగా, సైజును బట్టి రిటైల్‌గా ఒక్కో కాయ రూ.10 పలుకుతోంది. ప్రస్తుతం పచ్చళ్ల సీజన్‌ మొదలైంది. సాధారణంగా ఈ సీజన్‌లో ప్రతి ఇంట్లో మామిడి, నిమ్మ పచ్చళ్లను తయారు చేసుకుని ఏడాదంతా నిల్వ చేసుకుంటారు. మామిడి, నిమ్మ కాయల ధరలకు తోడు వంటనూనెలు, మసాల దినుసులు, కారం పొడులు కూడా భారీగా పెరగడంతో పచ్చడి మొతుకుల కోసం సామాన్య, మధ్య తరగతి       ప్రజలకు ఆర్థిక భారం తప్పడం లేదు.  
(చదవండి: అదృశ్యమైన సస్పెండెడ్‌ హోంగార్డ్‌ రామకృష్ణ మృతి.. పరువు హత్య?)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top