
భూమి అమ్మకానికి మంచిర్యాల జిల్లా రైతు లక్కీ డ్రా
భీమిని: మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలానికి చెందిన ఓ రైతు తనకున్న భూమిని అమ్మడానికి లక్కీ డ్రా పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మండలంలోని జన్కాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు టేకులపల్లి శివారులో తనకున్న నాలుగు ఎకరాల భూమిని లక్కీ డ్రా పెట్టాడు. రూ.10 వేల నగదు చెల్లించి టోకెన్ పొందాలని పేర్కొన్నారు. 1,500 మంది కాగానే అందరి సమక్షంలో లక్కీ డ్రా తీస్తామంటూ తన చేనుకు వెళ్లే దారిలో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు.
ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్లెక్సీలో సర్వే నంబర్లతోపాటు రూట్ మ్యాప్, పూర్తి వివరాలు పొందుపర్చాడు. లక్కీడ్రా ద్వారా మార్కెట్ ధర కంటే అధికంగా లాభం వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. డ్రా కోసం ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా కూడా చెల్లించవచ్చని తన ఫోన్ నంబర్ కూడా పేర్కొన్నాడు. కాగా, లక్కీడ్రా తీసే తేదీ ప్రకటించకపోవడంతో 1,500 టోకెన్లు పూర్తి అయ్యేదెప్పుడు లక్కీడ్రా తీసేదెప్పుడు అన్న చర్చ కూడా జరుగుతోంది.
సరైన ధర రాకపోవడం వల్లే..
భూమి అమ్మకానికి లక్కీడ్రా కోసం ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన రైతు భీమేశ్‌ను వివరణ కోరగా, తన సొంత అవసరాల కోసం భూమి విక్రయించేందుకు ప్రయత్నించగా, సరైన ధర రాకపోవడంతో లక్కీడ్రా కూపన్ ఆలోచన వచ్చినట్లు తెలిపాడు. డ్రా నిర్వహణకు సంబంధించి ఎలాంటి రిజిస్ట్రేషన్ చేసుకోలేదని పేర్కొన్నాడు. నవంబర్ మొదటి వారంలో లక్కీడ్రా తీసే తేదీని ప్రకటిస్తానని తెలిపాడు.