
ఎస్‌ఐ, పోలీస్ సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన బాధితుడు
మిర్యాలగూడ అర్బన్(నల్గొండ జిల్లా): యూరియా కోసం నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నానని తనపై వాడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని దామరచర్ల మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ధనావత్ సాయిసిద్ధు ఆరోపించాడు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలో అతడు విలేకరులతో మాట్లాడుతూ.. కొత్తపేట గ్రామంలో ఇటీవల తన అన్నను కొంతమంది కొట్టగా, వారిపై తాను తిరగబడ్డానని.. ఈ ఘటనకు సంబంధించి ఒకరిపై ఒకరం కేసులు పెట్టుకున్నట్లు సాయిసిద్ధు పేర్కొన్నాడు. అయితే ఈ నెల 3న మిర్యాలగూడ పట్టణంలోని చింతపల్లి రోడ్డుపై యూరియా కోసం రైతులు నిర్వహించిన ధర్నాలో తాను పాల్గొన్నానని గుర్తించిన వాడపల్లి పోలీసులు తనపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారని వాపోయాడు.
తాను ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తానని.. గుంట భూమి లేనోడివి యూరియా కోసం చేసిన ధర్నాలో ఎందుకు పాల్గొన్నావని ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డితో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు తనను విచక్షణారహితంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను నడవలేని స్థితిలో ఉండగా పెయిన్ కిల్లర్ ట్యాబెట్లు వేసి జడ్జి ఎదుట హాజరుపర్చారని, తనను కొట్టిన విషయం జడ్జికి చెప్తే బెయిల్ రాకుండా చేస్తామని బెదిరించారని ఆరోపించాడు. అయితే తాను ఈ విషయాన్ని జడ్జి ఎదుట చెప్పడంతో జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికిత్స చేయించాలని సిఫారసు చేశారని తెలిపాడు. వైద్య పరీక్షల అనంతరం తనను రిమాండ్ తరలించగా.. 12 రోజులు జైలులో ఉన్న తర్వాత బెయిల్‌పై వచ్చినట్లు వివరించాడు.
తనను కులం పేరుతో దూషిస్తూ తీవ్రంగా కొట్టిన వాడపల్లి ఎస్‌ఐ, పోలీస్ సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు సాయిసిద్ధు తెలిపాడు. కాగా ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో పనిచేసిన సమయంలోనూ ఓ రైతును పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచక్షణారహితంగా కొట్టినట్లు ఆరోపణలు ఉండగా.. తాజాగా వాడపల్లిలోనూ అదేవిధమైన ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఈ విషయంపై ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డిని వివరణ కోరగా.. తాను ఎవరినీ కొట్టలేదని, సంబంధిత వ్యక్తిపై నమోదైన కేసులో అతడిని జైలుకు పంపామని పేర్కొన్నారు.