
ఓ అభ్యర్థికి చెక్కును అందిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి, సింగరేణి సీఎండీ బలరాం. చిత్రంలో గండ్ర సత్యనారాయణ, రాజ్ ఠాకూర్, నవీన్ మిట్టల్, హర్కర వేణుగోపాల్, జనక్‌ప్రసాద్
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
సింగరేణి తోడ్పాటుతో 178 మంది సివిల్స్ అభ్యర్థులకు రూ. లక్ష చొప్పున చెక్కుల అందజేత
సాక్షి, హైదరాబాద్: సివిల్స్ సాధించాలనుకునే అభ్యర్థులకు ఎంతయినా సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. సివిల్స్‌లో తెలంగాణ విద్యార్థులే అత్యధికంగా ఎంపిక అవ్వాలని ఆయన అన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ‘రాజీవ్ సివిల్స్ అభయ హస్తం’పథకం పేరుతో సివిల్స్ మెయిన్స్‌కు సన్నద్ధమయ్యే 178 మందికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించే చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం ప్రజాభవన్‌లో జరిగింది. చెక్కులు అందించిన అనంతరం భట్టి మాట్లాడారు.
సమాజంలో మానవ వనరులే బలమైన పెట్టుబడులని, వీటిని సానబట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా రూ.లక్ష ఆర్థిక సాయం, ఢిల్లీలో వసతులు కల్పిస్తామని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. మొదటి సంవత్సరం 148 మందికి ఆర్థిక తోడ్పాటునిచ్చినట్టు చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో బ్యూరోక్రసీ పాత్ర కీలకమని, ప్రజల జీవన స్థితిగతులను వీరే మార్చగలరన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎక్కువ మంది ఎంపికవ్వాలి: కోమటిరెడ్డి
విద్యాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రం నుంచి ఎక్కువ మంది సివిల్స్‌కు ఎంపికైతే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఈ పథకం సహాయంతో సివిల్స్‌లో విజయం సాధించి, పరిపాలన విభాగంలో అంకితభావంతో పనిచేయాలని కోరారు.
ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిత్తల్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ పేదింటి పిల్లలు కూడా సివిల్స్‌లో విజయం సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోందన్నారు. 2024లో తెలంగాణ ప్రాంతం నుంచి సివిల్స్ విజేతలైన 30 మందికి ఈ సందర్భంగా మెమెంటోలను బహూకరించారు. వరంగల్‌కు చెందిన ఎట్టబోయిన సాయిశివాని సివిల్స్‌లో 11వ ర్యాంక్ సాధించడంపై ముఖ్యఅతిథులు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, గండ్ర సత్యనారాయణ, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు.