ప్రీమియం, చందా కట్టనక్కరలేదు
ప్రమాదం జరిగితే బీమా వర్తింపు
ఉద్యోగ సంఘాల హర్షం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు రూ.1.20 కోట్ల జీవిత బీమా రక్షణ కల్పించే ఎంప్లాయీస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను ప్రవేశపెడుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
రేపే ప్రారంభం!: ఎంప్లాయీస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లో ఉద్యోగులు, పెన్షనర్లు ఎలాంటి ప్రీమియం, చందా, ఇతర చెల్లింపులేవీ కట్టాల్సిన అవసరం లేదు. ఈ బీమా పథకాన్ని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి ఈనెల 25న రవీంద్రభారతిలో మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ బీమా పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకులతో అవగాహన(ఎంఓయూ) కుదుర్చుకోనుంది. రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు చెబుతున్నారు.
ఉద్యోగ సంఘాల పిలుపు: ఎంప్లాయీస్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలు, యూనియన్లు, సంస్థలు తమ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రతినిధులతో పాటు జంట నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా హాజరు కావాలని తెలంగాణ గెజిటెడ్ ఎంప్లాయీస్ జేఏసీ (టీజీఈజేఏసీ) చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ఉద్యోగులు తమ గుర్తింపు కార్డులు (ఐడీ కార్డులు) వెంట తెచ్చుకోవాలని సూచించారు.
ఇది ఊహించని మేలు: ‘ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ మొత్తంలో జీవిత బీమా కల్పించడం ఎవరూ ఊహించనిద’ని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ సైదులు అన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా కల్పించే ఈ నిర్ణయం ప్రభుత్వ సంక్షేమ దృక్పథానికి నిదర్శనం’అని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, మంత్రులకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల తరఫున జేఏసీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు.


