
మండలానికి 4–6 మంది.. వారంరోజుల్లో నియామక ప్రక్రియ పూర్తి
రెవెన్యూ అధికారులకు మంత్రి పొంగులేటి దిశా నిర్దేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెవెన్యూ గ్రామాల వారీగా లైసెన్సుడు సర్వేయర్ల నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే లైసెన్సుడు సర్వేయర్ల శిక్షణ పూర్తి చేసుకున్న 7 వేల మందికి పైగా సిబ్బందిని మండలాల వారీగా పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతి రెవెన్యూ మండలంలోని గ్రామాలను బట్టి ఆయా మండలాలకు 4–6 మందిని లైసెన్సుడు సర్వేయర్లుగా నియమించనున్నట్టు సమాచారం.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో లైసెన్సుడ్ సర్వేయర్ల నియామకంపై ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారని, ఈ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేస్తారనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. గత మే 26 నుంచి జూలై 26 వరకు జిల్లా కేంద్రాల్లో ఏడువేల మందికి పరీక్షలు నిర్వహించారు. అదే నెల 28, 29 తేదీల్లో జేఎన్టీయూ ఆధ్వర్యంలో వారికి ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ఇచ్చారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి 40 రోజుల పాటు ఇచ్చే అప్రెంటీస్ శిక్షణ కూడా పూర్తి చేశారు. ఇక, రెండోదశ శిక్షణను ఆగస్టు 18వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభించారు.
తొలిదశ శిక్షణ పూర్తి చేసుకున్న వారిని అక్టోబర్ రెండో తేదీ నుంచి గ్రామాల్లో నియమించాలని ప్రభుత్వం భావించినా అనివార్య కారణాల వల్ల సాధ్యం కాలేదు. ఈలోపు పంచాయతీ ఎన్నికల కోడ్ రావడంతో ఆ ఎన్నికలు పూర్తయిన తర్వాతే నియామకాలు జరపాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. కానీ, కోర్టు కేసుల కారణంగా ఈ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో మళ్లీ పంచాయతీ ఎన్నికల కోడ్ వచ్చేలోపు లైసెన్స్‌డ్ సర్వేయర్ల నియామకాలను పూర్తి చేయాలని ఆ శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో లైసెన్సుడు సర్వేయర్లను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియను పూర్తి చేయనుంది.