సామాన్యుడి దగ్గరే రుబాబు బడా బాబుల దగ్గర బాబ్బాబు! | Leading companies that have not paid electricity bills for years in Telangana | Sakshi
Sakshi News home page

సామాన్యుడి దగ్గరే రుబాబు బడా బాబుల దగ్గర బాబ్బాబు!

Jun 28 2025 3:22 AM | Updated on Jun 28 2025 3:22 AM

Leading companies that have not paid electricity bills for years in Telangana

ఏళ్ల తరబడి కరెంటు బిల్లులు చెల్లించని ప్రముఖ సంస్థలు  

దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలోనే రూ.529.22 కోట్ల బకాయిలు 

బిల్లులు అడిగితే క్రాస్‌ సబ్సిడీ పేరుతో కిరికిరి 

జాబితాలో మార్గదర్శి చిట్‌ఫండ్స్, పలు స్టార్‌ హోటళ్లు, కార్పొరేట్‌ ఆస్పత్రులు  

వసూళ్లకు ప్రత్యేక బృందాలు: దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ

సాక్షి, హైదరాబాద్‌: సామాన్యులు కరెంట్‌ బిల్లు కట్టడం ఒక్క రోజు ఆలస్యమైనా కనెక్షన్‌ కట్‌ చేసే విద్యుత్‌ అధికారులు.. బడాబాబులు రూ.కోట్లలో బకాయి పడ్డా వారి జోలికి వెళ్ల డం లేదు. ఏళ్ల తరబడి బిల్లులు పేరుకుపోయినా పట్టించుకునే నాథుడే లేడు. ధైర్యం చేసి ఎప్పుడైనా బిల్లు కోసం వెళ్తే బడా సంస్థలు ‘కడతాం లే’అంటూ విద్యుత్‌ అధికారులను గేటు బయట నుంచే పంపేస్తున్నాయి. పలు సంస్థలు కొన్నేళ్లుగా బిల్లులు చెల్లించకపోవటంతో ఇప్పుడు ఆ బకాయిలు ఏకంగా రూ.529.22 కోట్లకు చేరాయి. ఇది దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలోది మాత్రమే.

ఇంకా స్పష్టంగా చెప్పాలంటే హైదరాబాద్‌ పరిధిలోని 725 కనెక్షన్ల మొండి బకాయిల రికార్డు ఇది. బకాయి పడ్డ సంస్థలన్నీ మామూలువేం కాదు. కార్పొరేట్‌ ఆస్పత్రులు, కోట్లలో వ్యాపారం చేసే టెలి సర్వీసెస్‌ కంపెనీలు, స్టార్‌ హోటళ్లు, పెద్దపెద్ద రిసార్టులు... మార్గదర్శి వంటి ప్రముఖ చిట్‌ఫండ్‌ కంపెనీలు విద్యుత్‌ బిల్లులు బకాయి పడ్డ సంస్థల జాబితాలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.80 లక్షల వ్యవసాయేతర విద్యుత్‌ కనెక్షన్లుంటే, హైదరాబాద్‌లోనే 1.20 లక్షలున్నాయి. అంతేకాదు 1,700 హైటెన్షన్‌ విద్యుత్‌ కనెక్షన్లు హైదరాబాద్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో వాడే వ్యవసాయేతర విద్యుత్‌లో 70 శాతం జంట నగరాల్లోనే వినియోస్తున్నారు. ఇందులోనూ బడాబాబుల చేతుల్లో ఉన్న సంస్థలే దాదాపు 50 శాతం విద్యుత్‌ వాడుతున్నాయి.  

గట్టిగా మాట్లాడితే కోర్టుకెళ్తాం 
బకాయిల వసూళ్లపై దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ ఎండీ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ ప్రత్యేక దృష్టి పెట్టారు. అన్ని జోన్ల విద్యుత్‌ అధికారులతో ఇటీవల ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బకాయిల వసూళ్లలో ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హెచ్‌టీ కనెక్షన్లకు నిర్ణీత విద్యుత్‌ ఛార్జీలు ఉంటాయి. కొన్నిసార్లు ఇవి పెరుగుతుంటాయి. డిస్కమ్‌లు వివిధ సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తాయి. కొన్నిసార్లు ముందుగా వేసిన అంచనాల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని గృహ విద్యుత్‌ వినియోగదారులపై వేయడం భారంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్రాస్‌ సబ్సిడీ పేరుతో హెచ్‌టీ కనెక్షన్‌దారుల నుంచి పెరిగిన విద్యుత్‌ భారాన్ని వసూలు చేస్తారు.

విద్యుత్‌ ఆదాయ, అవసరాల నివేదికలోనూ దీన్ని పేర్కొంటారు. బకాయిలు పడ్డ సంస్థలు ఈ వాదనతో ఏకీభవించడం లేదు. క్రాస్‌ సబ్సిడీని సవాల్‌ చేస్తూ అవి కోర్టుకు వెళ్తున్నాయి. దీన్ని అడ్డుపెట్టుకుని బకాయిలు చెల్లించడం లేదని క్షేత్రస్థాయి విద్యుత్‌ అధికారులు తెలిపారు. ఈ ఏడాది మే నెల వరకు దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలో ఉన్న ఈ కేసులపై న్యాయ పరమైన చిక్కులను పరిష్కరించేందుకు సీఎండీ కృషి చేస్తున్నారు. కంపెనీ న్యాయవాదులతో ఆయన ఇటీవల సమావేశమై జాతీయ స్థాయిలో క్రాస్‌ సబ్సిడీపై కోర్టులు ఇచ్చిన తీర్పులు, ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు.

ప్రత్యేక దృష్టి పెట్టాం 
మొండి బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఎంత పెద్దవాళ్లయినా వదిలే ప్రసక్తే లేదు. ప్రభుత్వం నుంచి మాకు పూర్తి మద్దతు ఉంది. రూ.కోట్ల వ్యాపారం చేసే వ్యక్తులే బిల్లులు కట్టకపోతే ఎలా? బకాయిల వసూలుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. న్యాయపరమైన చిక్కులను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలోనే బకాయిల వసూళ్లలో పురోగతి సాధిస్తాం. ఇప్పటికే కొన్ని సంస్థల నుంచి సగం వరకు బకాయిలు వసూలు చేశాం.      – ఎండీ ముషారఫ్‌ అలీ ఫారూఖీ,
దక్షిణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ.

Advertisement
 
Advertisement
Advertisement