బర్డ్‌ ప్లూ: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

Latest Bird Flu Outbreak And Govt Strategy To Combat It - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని పలు రాష్ట్రాల్లో ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ ఫ్లూ) వైరస్‌ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వన్యప్రాణి విభాగం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అందులో భాగంగానే అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు వన్యప్రాణి విభాగం ఐజీ రోహిత్ తివారీ లేఖ రాశారు. కేంద్రం ఆదేశాల మేరకు పీసీసీఏఫ్ ఆర్ శోభ.. చీఫ్ కన్సర్వేటర్లను, అన్ని జిల్లాల అటవీ అధికారులను అప్రమత్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో చాలా పక్షులు చనిపోతున్నాయి. ఇందులో వలస పక్షులు కూడా ఉన్నాయి. వాటి నమూనాలను ఐసీఏఆర్- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ ఎనిమల్ డిసీసెస్, భోపాల్‌లో పరీక్షిస్తే హెచ్5ఎన్1 ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కేంద్రం తెలిపింది. చదవండి: (బర్డ్‌ ఫ్లూ మనుషులకు సోకుతుందా?)

తాజా పరిస్థితుల్లో ఈ వైరస్ పెంపుడు జంతువులు, పక్షులకు విస్తరించే అవకాశం ఉంది. వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రాష్ట్రాలు తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. పక్షులను పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకొని పెంచడంతో పాటు వాటిపై నిఘా ఉంచాలి. ఏవైనా లక్షణాలు కనిపిస్తే అరికట్టేందుకు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు తక్షణమే తగిన చర్యలు తీసుకొని వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడాలని కోరింది. 

ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో పక్షులు కూడా ఈ వ్యాధి బారిన పడినట్లు సమాచారం. దీంతో తెలంగాణ అటవీ శాఖ కూడా అప్రమత్తం అయ్యింది. జూ పార్క్‌లతో పాటు, అటవీ ప్రాంతంలో ఏవైనా అసహజ మరణాలు ఉంటే నమోదు చేయాలని, తగిన పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయాలని ఆదేశించారు. ఈ సీజన్ లో వలస పక్షుల సంచారం ఉంటుందని వాటిని కూడా పర్యవేక్షించాలని తెలిపారు. ఎవరికైనా సంబంధించిన సమాచారం ఉంటే అటవీ శాఖ టోల్ ఫ్రీ నెంబర్‌ 18004255364కు ఫోన్ చేయాలని కోరారు. చదవండి: (దేశంలో కొత్త విపత్తు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top