బర్డ్‌ ఫ్లూ మనుషులకు సోకుతుందా?

Bird Flu Raise New Tension In India - Sakshi

పక్షులకు వచ్చే జలుబు. ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా టైప్‌ –ఏ వైరస్‌లు వ్యాధి కారకాలు. కోవిడ్‌–19 కారక కరోనా వైరస్‌లో మాదిరిగానే ఈ వైరస్‌లోనూ పలు రకాలు ఉన్నాయి. తక్కువ ప్రభావం చూపేవి కొన్ని.. అధిక ప్రభావం చూపేవి మరికొన్ని. రెండో రకం వైరస్‌లు కోళ్లు ఇతర పక్షులకు తీవ్రస్థాయిలో ప్రాణ నష్టం కలిగిస్తాయి. సాధారణంగా ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లను ‘‘హెచ్‌’’, ‘‘ఎన్‌’’రకాలుగా వర్గీకరిస్తారు. సాధారణంగా ఈ వైరస్‌లు మనుషుల్లోకి ప్రవేశించవు కానీ.. కొన్నిసార్లు జలుబు నుంచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు కలిగిస్తాయి. ప్రాణాలు కోల్పోవడమూ సంభవమే. కోళ్లు ఇతర పౌల్ట్రీ పక్షుల వ్యర్థాలను ముట్టుకోవడం ద్వారా వ్యాధి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువ. 

మనుషులకూ సోకుతుందా?
మనుషులకు బర్డ్‌ ఫ్లూ సోకే అవకాశాలు అరుదు. కానీ హెచ్‌5, హెచ్‌7, హెచ్‌9 రకాల వైరస్‌లు మాత్రం మనుషుల్లోకి ప్రవేశిస్తాయని ఇప్పటికే రూఢీ అయ్యింది. వైరస్‌ సోకిన పక్షులను తాకడం, వాటి స్రావాలతో కలుషితమైన ఉపరితలాలను ముట్టుకోవడం ద్వారా మనుషులకూ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. బాగా వండిన కోడిగుడ్లు, చికెన్‌లతో వ్యాధి సోకే అవకాశాలు లేవు.

ఇతరులకు సోకుతుందా? 
జలుబు లాంటి లక్షణాలే కనిపిస్తాయి. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, కడుపు నొప్పి, వాంతులు, అతిసారం, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో న్యుమోనియా, శ్వాస సమస్యలు, మరణమూ సంభవించవచ్చు. మనుషుల నుంచి ఇతరులకు బర్డ్‌ఫ్లూ సోకదు. 

ఎలాంటి పక్షులకు సోకుతుంది?
కోళ్లు, బాతులు, హంసలు, నెమళ్లు, కాకుల వంటి పక్షులపై బర్డ్‌ఫ్లూ ప్రభావం ఉంటుంది. కోళ్లలో అతిసారం, కాలి పంజా ప్రాంతాలు వంకాయ రంగులోకి మారడం, తల, కాళ్లు వాచిపోవడం, వంటివి కనిపిస్తాయి. ముక్కు, ఊపిరితిత్తుల నుంచి వెలువడే ద్రవాల ద్వారా ఈ వ్యాధి పక్షుల్లో వ్యాపిస్తుంది. వ్యాధికి గురైన పక్షుల మలం తగిలినా చాలు. కలుషిత ఆహారం, నీరు ద్వారానూ వ్యాపిస్తుంది. 

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
బాగా ఉడికించిన తరువాత మాత్రమే చికెన్, గుడ్లు వంటివి తినాలి. ఉడికించని పక్షి మాంసాన్ని ఇతర ఆహార పదార్థాలకు దూరంగా ఉంచడం మేలు. పౌల్ట్రీ రంగంలో పనిచేసే 
వారు వ్యక్తిగత శుభ్రతను కచ్చితంగా పాటించాలి. కోళ్లఫారమ్‌లలో పనిచేసేటప్పుడు చేతులకు కచ్చితంగా తొడుగులు వేసుకోవడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, 
ఎన్‌95 మాస్కులు ధరించడం, పీపీఈ కిట్లు, కళ్లజోళ్లు వాడటం ద్వారా వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.  
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top