కర్రి గుట్టలపై బేస్‌ క్యాంప్‌ ! | Lack of coordination between forces participating in karregutta operation | Sakshi
Sakshi News home page

కర్రి గుట్టలపై బేస్‌ క్యాంప్‌ !

May 1 2025 3:46 AM | Updated on May 1 2025 1:04 PM

Lack of coordination between forces participating in karregutta operation

గుట్టలపై జాతీయ జెండాను ఎగురవేసిన జవాను 

హెలికాప్టర్‌ ద్వారా సామగ్రి చేరవేత..రాత్రీ పగలు పహారా

ఆపరేషన్‌లో పాల్గొంటున్న బలగాల మధ్య సమన్వయ లోపం !

శాంతి చర్చల డిమాండ్లపై భగ్గుమన్న ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి విజయ్‌శర్మ

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: కర్రి గుట్టలపై భద్రతా దళాలు బేస్‌ క్యాంప్‌ ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ఆపరేషన్‌లో భాగంగా గుట్టలపైకి చేరుకున్నాక, ఓ జవాన్‌ అక్కడ జాతీయ జెండాను ఎగురవేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. తెలంగాణ కమిటీ, దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమి­టీ, సెంట్రల్‌ రీజనల్‌ బ్యూరోలతోపాటు పీఎల్‌జీఏ కంపెనీ–1కు చెందిన మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారనే సమాచారంతో ఏప్రిల్‌ 21 సాయంత్రం కర్రి గుట్టలు బచావో ఆపరేషన్‌ను భద్రతా దళాలు చేపట్టిన విషయం తెలిసిందే. 

ఆ తర్వాత ఎట్టకేలకు ఏప్రిల్‌ 28, 29 తేదీల్లో గుట్టల­పైకి చేరుకున్నాయి. వారు పహారా కాసేందుకు అవ­సరమైన సామగ్రిని హెలికాప్టర్‌ ద్వారా చేరవే­శా­రు. దీంతో కర్రి గుట్టలపై ఫార్వార్డ్‌ ఆపరేటింగ్‌ బేస్‌ (ఎఫ్‌ఓబీ)ని భద్రతా దళాలు ఏర్పాటు చేసి­న­ట్టు సమాచారం. ఈ మేరకు కర్రి గుట్టలపై త్రివర్ణ పతాకం పట్టుకొని నడుస్తున్న జవాన్‌తోపాటు బేస్‌ ఏర్పాటు, కూంబింగ్‌కు సంబంధించిన వీడియోలు బుధవారం వెలుగు చూశాయి.

రాత్రీపగలు పహారా..
ఆపరేషన్‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు కర్రి గుట్టలపై మావోయిస్టుల అలజడి లేదు. సహజ సిద్ధంగా ఏర్పడిన గుహలు, నీటి వనరులతోపాటు మావోలు ఏర్పాటు చేసుకున్న బంకర్లు ఇక్కడ విరివిగా ఉన్నట్టు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. దీంతో తమ అధీనంలోకి తెచ్చుకున్న ప్రాంతంలోకి తిరిగి మావోయిస్టులు రాకుండా ఉండేందుకు ఇక్కడ ఎఫ్‌ఓబీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. తద్వారా రాత్రీ పగలు పహారా కాసేందుకు అవకాశం చిక్కుతుంది. 

ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడిన తర్వాత మరిన్ని దళాలను కొండపైకి రప్పించి, క్రమ­క్రమంగా ఈ గుట్టలను తమ అధీనంలోకి తెచ్చుకోవాలనేది భద్రతా దళాల వ్యూహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంపై పూర్తి స్థాయిలో పట్టు చిక్కేవరకు వాయుసేవలను ఉపయోగించుకోనున్నారు. 

అంతేకాదు.. ప్రస్తుతం ఏర్పాట­వు­తున్న ఎఫ్‌వోబీలు, భవిష్యత్‌లో రాబోయే క్యాంపులకు అవసరమైన జవాన్ల కోసం అదనపు బలగాలను కూడా ఇక్కడకు రప్పిస్తున్నట్టు తెలుస్తోంది. గెరిల్లా యుద్ధతంత్రంలో ఆరితేరిన మావోయిస్టులు ఒక వైపు, జంగిల్‌ వార్‌ఫేర్‌లో శిక్షణ పొందిన భద్రతా దళాలు మరోవైపు అతి సమీపంలో మకాం వేయడంతో కర్రి గుట్టలపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

సమన్వయ లోపం !
ఈ ఆపరేషన్‌లో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి స్పెషల్‌ పార్టీ, గ్రేహౌండ్స్‌ దళాలు, మహారాష్ట్ర నుంచి సీ –60 కమాండోలు, ఒడిశా నుంచి స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌ దళాలు కర్రి గుట్టల ప్రాంతానికి చేరుకున్నట్టు సమాచారం. అయితే ఈ ఆపరేషన్‌ను పూర్తిగా తమ బలగాలైన డీఆర్‌జీ, బస్తర్‌ ఫైటర్స్, ఎస్‌టీఎఫ్‌లతోపాటు సీఆర్‌పీఎఫ్‌ సహకారంతో చేస్తామని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది. 

దీంతో రాష్ట్ర సరిహద్దులకే పరిమితమైన తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా ప్రత్యేక బలగాలు తిరుగు ప్రయాణం అయ్యాయనే ప్రచారం సాగుతోంది. ఆపరేషన్‌ కర్రి గుట్టలు బచావోలో తెలంగాణ పోలీసులు లేరని ఇటీవల ఐజీ చంద్రశేఖరరెడ్డి ప్రకటించడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. మరోవైపు కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) చీఫ్‌ తపన్‌ దేకా దగ్గరుండి ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. 

వాళ్లకు ఏం సంబంధం..?
మావోలతో ప్రభుత్వం చర్చలు జరపాలంటున్న తెలంగాణ (సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్, శాంతి కమి­టీ­లు, మేధావులు, ప్రజాసంఘాలు)పై ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి విజయ్‌శర్మ మండిపడ్డారు. ‘శాంతి చర్చలు జరపాలని అడగ­డా­నికి వారెవరు.. ఛత్తీస్‌గఢ్‌లో హింసకు పాల్ప­డుతున్న వారితో వీరికి ఏం సంబంధం’అని ప్రశ్నించారు. కర్రి గుట్టల ఆపరేషన్‌ మొదలుకాగానే వీరు బాధను వ్యక్తం చేస్తూ చర్చలు జరపాలని మా­ట్లాడుతుండటం అనుమానాలకు (దాల్‌ మే కుచ్‌ కాలా హై) తావిస్తోందన్నారు. 

వీరు తమ మాటల ద్వారా దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మావోయిస్టు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారిలో ఎక్కువ మంది తెలంగాణ వారే ఉండటం, వారిలో ఎక్కువ మంది కర్రి గుట్టలపై ఉన్నట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విజయ్‌శర్మ మీడియా ముఖంగా బుధవారం రాయ్‌పూర్‌లో చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement