రాష్ట్రంలో లక్ష ఉద్యోగాల కల్పన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో లక్ష ఉద్యోగాల కల్పన

Aug 19 2026 1:12 AM | Updated on Aug 19 2026 1:12 AM

ఇన్నోవేషన్‌ సెంటర్లకు పోటీలు

మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి

మణుగూరు టౌన్‌/మణుగూరురూల్‌: రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఇప్పటివరకు ఉపాధ్యాయులు, నర్సులు, సింగరేణి, ఇతర ప్రభుత్వ సంస్థల్లో సుమారు లక్ష ఉద్యోగాలు కల్పించిందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనులు, భూగర్భ శాఖల మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. మంగళవారం పినపాక నియోజకవర్గం మణుగూరు ఐటీఐ–ఏటీసీ కళాశాల విద్యార్థుల ఆవిష్కరణల అభినందన కార్యక్రమానికి అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని 119 ఏటీసీ (అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ల)ను టాటా సంస్థతో కలిసి అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. టాటా సంస్థ తెలంగాణలో సుమారు 4వేల కోట్ల పెట్టుబడితో ఈ సాంకేతిక కేంద్రాల అభివృద్ధికి సహకరిస్తోందని, ఈక్రమాన విద్యార్థులకు ఇన్నోవేషన్‌ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అత్యుత్తమ ఆవిష్కరణ చేసే విద్యార్థులను గుర్తించి రాష్ట్రస్థాయిలో పోటీ నిర్వహించి అవార్డులతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టామ్‌కామ్‌ ద్వారా ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. జర్మనీ, జపనీస్‌ వంటి విదేశీ భాషల్లో శిక్షణ అందించి జర్మనీ, జపాన్‌ వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మణుగూరులో ఐటీసీ సంస్థతో సమన్వయం చేసుకుని సీఎస్‌ఆర్‌ నిధులతో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న 50 మంది విద్యార్థులకు అభినందన పత్రాలు అందజేశారు. అనంతరం ఎంపీ బలరాంనాయక్‌, కలెక్టర్‌ అంకిత్‌, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడగా.. కార్యక్రమంలో భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ మృణాల్‌ శ్రేష్ఠ, ఎంప్లాయ్‌మెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్ల జాయింట్‌ డైరెక్టర్‌ నగేశ్‌, టామ్‌కామ్‌ ఈఓ గౌస్‌ పాషా, రతన్‌ టాటా ఆర్డీడీ కోటేశ్వరరావు, ఏటీసీ కళాశాల ప్రిన్సిపాల్‌ సారంగపాణి, తహసీల్దార్‌ అద్దంకి నరేశ్‌, ఎంపీడీఓ శీకాంత్‌, అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. మణుగూరు పర్యటనలో భాగంగా మంత్రి వివేక్‌ వెంకటస్వామి మాలమహానాడు కార్యాలయాన్ని సందర్శించి మాట్లాడుతూ .. ఎస్సీ వర్గీకరణలో రోస్టర్‌ విధానంలోనూ మాలలకు నష్టం జరుగుతోందని, ఈ అంశంపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి బూర్గుల వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు వేర్పుల నరేష్‌, కార్యదర్శి బూర్గుల సతీష్‌, నాయకులు, అంబేద్కర్‌ సేవా సమితి ప్రతినిధులు శ్రీనివాస్‌, వెంకట్‌, కిరణ్‌, తిరుపతమ్మ, దేవకరుణ, జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.

వినతుల వెల్లువ..

సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించి పెనాల్టీ విధానాన్ని రద్దు చేయాలని టీయుసీఐ జిల్లా అధ్యక్షుడు ఆర్‌. మధుసూదన్‌రెడ్డి మంత్రి వివేక్‌ వెంకటస్వామికి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా స్థానిక కంపెనీల్లో నియోజకవర్గ యువతకు 100 శాతం అవకాశాలు కల్పించాలని సామాజిక కార్యకర్త కర్నె రవి వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement