కేంద్ర పథకాల అమలులో జాప్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

కేంద్ర పథకాల అమలులో జాప్యం వద్దు

Aug 19 2026 1:12 AM | Updated on Aug 19 2026 1:12 AM

చుంచుపల్లి: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని దిశా కమిటీ చైర్మన్‌, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఖమ్మం ఎంపీ, దిశా కమిటీ చైర్మన్‌ రఘురాంరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని మహబూబాబాద్‌ ఎంపీ పి.బలరాంనాయక్‌, కలెక్టర్‌ అంకిత్‌, పినపాక, ఇల్లెందు, భద్రాచలం, కొత్తగూడెం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, కూనంనేని సాంబ శివరావులతో కలిసి నిర్వహించారు. ఆరోగ్యం, తాగునీటి సరఫరా, విద్య, ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, బీఎస్‌ఎన్‌ఎల్‌, రైల్వేలు, జాతీయ రహదారులు, స్వచ్ఛ భారత్‌ మిషన్‌, అమృత్‌ పథకం, తదితర కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ.. ఆస్పత్రులకు అవసరమైన సిటీ స్కాన్‌ వంటి వైద్య పరికరాల కొనుగోలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి సంబంధిత ప్రజాప్రతినిధులు సీఎస్‌ఆర్‌ నిధులను సమీకరించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ 80 శాతం పూర్తయిందని, గుండాల ఘటనపై ఎవరు బాధ్యులు, ఇప్పటివరకు తీసుకున్న చర్యలేమిటో పూర్తి వివరాలతో డీఎంహెచ్‌ఓ 48గంటల్లో కలెక్టర్‌కు రిపోర్ట్‌ సమర్పించాలని ఆదేశించారు. కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు వెంటనే తాగునీటి కనెక్షన్లు ఇవ్వాలని, హ్యాండ్‌పంపుల మరమ్మతులు చేపట్టాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి, అవసరమైన చోట ప్రత్యామ్నా య వనరుల ద్వారా నీటిని అందించాలని సూచించారు. గురుకులాల్లో మధ్యాహ్న భోజ నానికి నిర్దేశించిన డైట్‌లో 50 శాతం కూడా అమలు కావడం లేదని, మూడు రోజుల పాటు ఒకే కూర వడ్డించిన పరిస్థితిని గమనించినట్లు చెప్పారు. ఈనేపథ్యాన జిల్లాలోని అన్ని గురుకులాలు, పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో అటవీ అనుమతుల కారణంగా విద్యుత్‌ లైన్లు, రహదారులు, పట్టా భూములకు సంబంధించిన సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపి సమావేశానికి డీఎఫ్‌ఓ హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్‌ ఎంపీ పి.బలరాంనాయక్‌ మా ట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించాలని అన్నారు. ఆస్పత్రుల్లో పడకల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇటీవల మంత్రులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా స్థాయి నుంచి సంపూర్ణ నివేదిక అందలేదని తెలిసిందని, అవసరమైన వైద్య పరికరాలు, ఇతర అవసరాలకు సంబంధించి సమగ్ర నివేదిక అందించాలని కోరారు. అటవీ భూములకు ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ జిల్లాలో 44 సబ్‌ సెంటర్లు, 14 పీహెచ్‌సీలు, 3 సీహెచ్‌సీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు వైద్య ఆరోగ్య శాఖకు సమర్పించినట్లు చెప్పారు. గుండాలలో 5 పడకల డయాలసిస్‌ కేంద్రం మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌, ఐటీడీఏ పీఓ రాహుల్‌, కొత్తగూడెం మేయర్‌ మూడ్‌ గణేష్‌, డీఎఫ్‌ఓ సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌, డీఆర్డీఓ విద్యా చందన, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, దిశ కమిటీ సభ్యులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

దిశా కమిటీ సమావేశంలో

ఎంపీ రఘురాంరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement