పెరిగింది 21.50 మెగావాట్లే
రెండో దశ
సోలార్ పవర్ ప్లాంట్ల వివరాలు..
సోలార్‌లో దూకుడుగా మొదలైన
సింగరేణి ప్రస్థానం
రెండు దశల్లో 532 మెగావాట్ల
విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం
ఇప్పటికీ సాఽధించింది కేవలం 245.50 మెగావాట్లే
నెట్‌జీరోకు ఆమడ దూరంలో
నిలిచిన సింగరేణి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: నెట్ జీరో కంపెనీగా కీర్తిప్రతిష్టలు గడించాలనే సింగరేణి సంస్థ ఆశలు ఇప్పట్లో తీరేలా లేవు. టార్గెట్ నెట్‌జీరోగా దాదాపు రెండేళ్ల కిందట మొదలైన పనులు నేటికీ పూర్తికాకపోవడమే ఇందుకు కారణం.
టార్గెట్ నెట్‌జీరో
తెలంగాణలో సింగరేణి ఆరుజిల్లాల పరిధిలోని పన్నెండు ఏరియాల్లో 17 ఓపెన్‌కాస్ట్, 22 భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. సంస్థలో నలభై వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరి సంక్షేమంలో భాగంగా క్వార్టర్లు, ఆస్పత్రులు, స్కూళ్ల్లు, కాలేజీలు, సూపర్‌బజార్‌లు నిర్వహిస్తోంది. పారి శ్రామిక, సంక్షేమ అవసరాల నిమిత్తం సంస్థ ప్రతీ ఏడాది సుమారుగా 700 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను తెలంగాణ ట్రాన్స్‌కో నుంచి వినియోగిస్తోంది. దీనికి గాను సగటున ప్రతీ ఏడాది విద్యుత్ బిల్లుల రూపంలో సుమారు 500కోట్ల చెల్లింపులు చేస్తోంది. ఈ విద్యుత్ బిల్లుల ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా సోలార్ విద్యుత్‌పై దృష్టి సారించింది. ఇదే సమయంలో ఎంత మొత్తంలో కాలుష్య కారకమైన థర్మల్ విద్యుత్‌ను వినియోగిస్తోందో అంతే మొత్తంలో కాలుష్య రహిత సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా ‘నెట్‌జీరో’కంపెనీగా నిలవాలని నిర్ణయించింది. నెట్‌జీరో కంపెనీగా నిలవాలంటే రమారమీ సింగరేణి సోలార్ విద్యుత్ సామర్థ్యం 350 మెగావాట్లకు మించి ఉండాలి.
రెండు దశల్లో 245.50
తొలిదశలో 300 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో తొమ్మిది సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణాన్ని సింగరేణి దశాబ్దం కిందట తలకెత్తుకుంది. 2023 ఆగస్టు నాటికి అందులో 224 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. మరో 70 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లు నిర్మాణ దశలో ఉన్నా యి. ఈ సమయంలో రెండో దశలో భాగంగా మరో 232 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఎనిమిది ప్లాంట్ల నిర్మాణానికి సింగరేణి శ్రీకారం చుట్టింది. ఈక్రమాన అప్పటి సీఎండీ ఎన్.శ్రీధర్ నేతృత్వాన రూ. 1348 కోట్ల వ్యయంతో టెండర్లు పిలవడం, నిర్మాణ సంస్థలకు పనులు అప్పగించారు. ఒప్పందం ప్రకా రం 2024 అక్టోబరు నాటికి సింగరేణి సోలాల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 532 మెగావాట్లకు చేరుకుని, నెట్‌జీరో కంపెనీగా రూపాంతరం చెందాలి.
ఇప్పటికే విమర్శలు
తెలంగాణ జెన్కోతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకోకుండా సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం చేయడం వల్ల సింగరేణి సంస్థకు ఆర్థిక భారం తప్ప మరేమి మిగల్లేదని, అధికారుల అనాలోచిన నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ సిద్దిపేట ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఇప్పటికే బలమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికై నా సోలార్ పవర్ ప్లాంట్ల విషయంపై సింగరేణి యాజమాన్యం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
నిర్దేశిత లక్ష్యం గడువు పూర్తయి రెండో ఏడాది సమీపిస్తున్నా ఇప్పటికీ సింగరేణి నెట్‌జీరో సంస్థగా ఆవిర్భవించలేదు. ఇటీవల కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయంపై 1.23 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ను సీఎండీ బుద్దప్రకాశ్ జ్యోతి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ మొత్తం సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 245.50 మెగావాట్లుగా పేర్కొన్నారు. గతంలో అంటే 2023 ఆగస్టు నాటి 232 మెగావాట్ల సామర్థ్యంతో పోల్చితే గడిచిన రెండేళ్లలో సింగరేణి కొత్తగా సాధించిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 21.50 మెగావాట్లుగా ఉంది. దీంతో నెట్‌జీరో లక్ష్యానికి ఆమడదూరంలో నిలిచినట్టయ్యింది.
సోలార్ ప్లాంట్ సామర్థ్యం స్థలం
(మె.వా) (ఎకరాల్లో)
మందమర్రి 67.50 240
రామగుండం–3 37 166
శ్రీరాంపూర్ 27.50 96
కొత్తగూడెం 32.50 130
జైపూర్ 37.50 130
ఇల్లెందు 15 55
భూపాలపల్లి 10 45
రామగుండం – 1 5 13


