మళ్లీ హోటల్ తెరుస్తాననుకోలేదు: కుమారి ఆంటీ | Sakshi
Sakshi News home page

మళ్లీ హోటల్ తెరుస్తాననుకోలేదు: కుమారి ఆంటీ

Published Wed, Jan 31 2024 4:03 PM

Kumari Aunty Thanks To Telangana CM Revanth Reddy - Sakshi

హైదరాబాద్‌, సాక్షి: ఫుడ్‌ స్టాల్‌తో నగరంలోని మాదాపూర్‌ ప్రాంతంలో ఫేమస్‌ అయ్యి.. ఆపై సోషల్‌ మీడియా ద్వారా ఆ ఫేమ్‌ను మరింత పెంచుకుంది కుమారి ఆంటీ. అయితే ఆ ఫేమ్‌ వల్లే జనాలు ఆమె ఫుడ్ స్టాల్ దగ్గర గుమిగూడడం.. అది ట్రాఫిక్ జామ్‌కు దారి తీయడంతో ఆమె స్టాల్‌ను పోలీసులు బలవంతంగా తొలగించాల్సి వచ్చింది. ఈ పరిణామంపై తీవ్ర చర్చ నడవగా.. చివరకు తెలంగాణ సర్కార్‌ ఆమెకు ఊరట ఇచ్చింది. ఈ పరిణామంపై ఆమె సాక్షితో స్పందించారు. 

‘‘గత 13 ఏళ్ల నుంచి స్ట్రీట్ ఫుడ్ నిర్వహిస్తున్నా. ముందు మాకు తొలగించాలని ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. నిన్న 50 వేల రూపాయల ఫుడ్ వేస్ట్ అయింది. నా ఫుడ్‌ కోర్టు బండిని సీజ్ చేశారు. మా కొడుకును పోలీసులు కొట్టారు. మళ్లీ హోటల్ తెరుస్తామని మేం అసలు అనుకోలేదు. నాలాంటి చిన్న స్ట్రీట్ ఫుడ్ హోటల్ మహిళను గుర్తించి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి స్పందించడం గొప్ప విషయం. అందుకు సీఎం రేవంత్‌రెడ్డిగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారామె.

కుమారి ఆంటీ అసలు పేరు దాసరి సాయి కుమారి. మాదాపూర్ లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఆమె కొన్నేళ్లుగా ఫుడ్‌స్టాల్‌ నడిపిస్తోంది. అయితే ఈ మధ్య  సోషల్‌ మీడియాలో ఆమె గురించి ఎక్కువ చర్చ నడిచింది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఆమె ఫుడ్‌ స్టాల్‌కు జనాల రాక మొదలైంది.  ఈ క్రమంలో జనం భారీగా గుమిగూడి.. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతూ వస్తోంది. దీంతో మంగళవారం ఆమె షాప్‌ను సీజ్‌ చేసి.. మరో చోటుకి తరలించాలని పోలీసులు ఆదేశించారు. అయితే మిగతా వాళ్లను వదిలేసి తననే తొలగించాలని ఆదేశించడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి: కుమారి ఆంటీ అందుకే టార్గెట్‌ అయ్యిందా?

మరోవైపు ఈ పరిణామంపై అదే సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసుల వైఖరిని ఆంధ్రప్రదేశ్‌ అధికార పార్టీ వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం తప్పు పట్టింది. సీఎం జగన్‌ తనకు మంచి చేశారని.. ఇళ్లు ఇచ్చారని ఆమె చెప్పడం వల్లే ఆమెను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించింది. దీంతో వ్యవహారం మరింత తీవ్రరూపం దాల్చక ముందే  తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. 

కుమారి ఆంటీ షాపును మార్చాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఆమె ఫుడ్‌కోర్టును యథావిధిగా కొనసాగించేందుకు అనుమతించాలని రాష్ట్ర డీజీపీతో పాటు ఎంఏయూడీ అధికారులను సీఎం రేవంత్‌ ఆదేశించినట్లు సీఎంవో తెలిపింది. మరోవైపు ఈ సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి ఆమె స్టాల్‌కు వెళ్లనున్నారనే ప్రచారం ఒకటి నడుస్తోంది.

 
Advertisement
 
Advertisement