పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వండి

KTR suggestion to BRS Party leaders - Sakshi

బీఆర్‌ఎస్‌ నేతలకు మంత్రి కేటీఆర్‌ సూచన 

వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించండి 

కేసీఆర్‌ సందేశం ప్రతి కార్యకర్తకు చేరేలా చూడండి 

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక వ్యవసాయ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించడం ద్వారా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు భరోసా కల్పించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పార్టీ నేతలకు సూచించారు.

ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యక్రమాల అమలును పర్యవేక్షించడంతో పాటు పంచాయతీరాజ్‌ రోడ్ల మరమ్మతు పనులు వర్షాకాలం లోపు పూర్తయ్యేలా సమన్వయం చేసుకోవాలని చెప్పారు.

ఉపాధి హామీ, పంచాయతీరాజ్, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా చేసిన పనులకు బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కేంద్రం నుంచి రూ.1,300 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నందునే బిల్లుల చెల్లింపు ఆలస్యమైందని వివరించారు.

సీఎం కేసీఆర్‌ సందేశాన్ని ప్రతి కార్యకర్తకు చేరేలా చూడాలని కేటీ ఆర్‌ ఆదేశించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, పార్టీ ఇన్‌చార్జీలతో సోమవారం ఆయన టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

ఏప్రిల్‌ 27న జెండా పండుగ 
పార్టీ జిల్లా ఇన్‌చార్జీల ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 20 నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేయడంతో పాటు బీఆర్‌ఎస్‌ కార్యకలాపాలు   విస్తృతంగా కొనసాగించాలని కేటీఆర్‌ సూచించారు. కేసీఆర్‌ తన సందేశంలో పేర్కొన్నట్టుగా.. ఉద్యమకాలం నుంచి పార్టీకి అండగా ఉంటూ రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు చేసిన కృషిని, పార్టీతో వారి అనుబంధాన్ని గుర్తు చేస్తూ.. తెలంగాణ అభివృద్ధి ప్రస్థానం అందరికీ అర్థమయ్యేలా వివరించాలని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రం పట్ల చూపిస్తున్న వివక్షపై ఆత్మీయ సమ్మేళనాల్లో ప్రత్యేకంగా చర్చించాలన్నారు. ఏప్రిల్‌ 20 నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసి, 25న నియోజకవర్గ స్థాయిలో బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

1,000 నుంచి 1,500 మంది పార్టీ ప్రతినిధులతో ఈ సమా వేశాలు జరుగుతాయని తెలిపారు. ఏప్రిల్‌ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాలు, వార్డుల్లో జెండా పండుగ కార్యక్రమం ఉంటుందన్నారు. ప్లీనరీకి ఆహ్వానం అందిన ప్రతినిధులు హాజరు కావాలని కేటీఆర్‌ సూచించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top