ఊరూరా పండుగలా.. | KTR Says BRS to hold a grand formation day ceremony April 27th | Sakshi
Sakshi News home page

ఊరూరా పండుగలా..

Apr 10 2023 1:04 AM | Updated on Apr 10 2023 3:57 PM

KTR Says BRS to hold a grand formation day ceremony April 27th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈసారి పెద్ద ఎత్తున నిర్వహించాలని భారత్‌ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) నిర్ణయించింది. కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతోపాటు.. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలకు పార్టీ శ్రేణుల్లో మంచి స్పందన వస్తుండటంతో.. ఈ ఉత్సాహాన్ని కొనసాగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఊరూరా పండుగలా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలని.. అన్ని స్థాయిల పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు పాల్గొనేలా చూడాలని నిర్ణయించింది. ఏప్రిల్‌ 27న బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ముందు, తర్వాత నిర్వహించే కార్యక్రమాలపై పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. దీనికి అనుగుణంగా పార్టీ శ్రేణులు సిద్ధంకావాలని సూచించారు.
 
25 నుంచి కార్యక్రమాలు.. 
ఈ నెల 25వ తేదీన పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జుల అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించుకోవాలని కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ఈ సమావేశాల నిర్వహణను సమన్వయం చేస్తారని, కనీసం 2.5 వేల నుంచి 3 వేల మంది వరకు సభలో పాల్గొనేలా చూడాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, వార్డుల్లో అదే రోజున ఉదయం పార్టీ జెండాలను ఎగరవేసి.. పండుగలా జరుపుకోవాలని, ఆ తర్వాత నియోజకవర్గ సమావేశాలకు రావాలని నేతలకు సూచించారు.

రోజంతా జరిగే పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలన్నింటిపై విస్తృతంగా చర్చించనున్నట్టు తెలిపారు. ప్రతినిధుల సభకు నియోజకవర్గ పరిధిలోని గ్రామ, వార్డు పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతోపాటు అన్నిస్థాయిల ప్రజా ప్రతినిధులు, కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు హాజరుకావాలని చెప్పారు. 

తెలంగాణభవన్‌లో ఆవిర్భావ దినోత్సవం 
ఈ నెల 27న హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడకలను నిర్వహించనున్నట్టు కేటీఆర్‌ తెలిపారు. అదేరోజున పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన పార్టీ జనరల్‌ బాడీ సమావేశం జరుగుతుందని.. సుమారు 300 మంది పార్టీ జనరల్‌ బాడీ ప్రతినిధులు అందులో పాల్గొంటారని వివరించారు.

ఈ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెడతారని.. వాటిపై విస్తృతంగా చర్చించి, ఆమోదిస్తారని వెల్లడించారు. తెలంగాణవ్యాప్తంగా ఈ నెలాఖరులో వరి కోతలు ఉండటం, ఎండల తీవ్రత దృష్ట్యా.. పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా నిర్వహించే బహిరంగసభ, ప్రతినిధుల సభను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. వీటిని కలిపి అక్టోబర్‌ 10న వరంగల్‌లో మహాసభ నిర్వహిస్తామని ప్రకటించారు. 

ఆత్మీయ సమ్మేళనాల కొనసాగింపు 
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణను పార్టీ అధినేత కేసీఆర్‌ అభినందించారని కేటీఆర్‌ తెలిపారు. ఈ ఆత్మీయ సమ్మేళనాలను మే నెలాఖరు దాకా కొనసాగించాలని కేసీఆర్‌ సూచించారని.. ఈ మేరకు చర్యలు చేపడుతున్నామని వివరించారు. 

మూడు నియోజకవర్గాలకు ఇన్‌చార్జులు 
సిట్టింగ్‌ ఎమ్మెల్యే జి.సాయన్న మృతి నేపథ్యంలో కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా మర్రి రాజశేఖర్‌రెడ్డిని కేసీఆర్‌ నియమించారు. ఇక గోషామహల్‌ ఇన్‌చార్జిగా నంద కిషోర్‌ వ్యాస్‌ బిలాల్, భద్రాచలం ఇన్‌చార్జిగా ఎంపీ మాలోతు కవితలను నియమించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలతోపాటు పార్టీ ఆవిర్భావ దిన వేడుకలు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు బాధ్యులుగా ఉంటారని ప్రకటించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement