‘మనఊరు–మనబడి’ స్కూళ్ల ప్రారంభం 

KTR And Sabitha Likely To Start Mana Ooru Mana Badi School In Siddipet - Sakshi

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రారంభించనున్న మంత్రులు కేటీఆర్, సబిత  

సాక్షి, హైదరాబాద్‌: మన ఊరు–మన బడి పథకం కింద పనులు పూర్తి చేసిన స్కూళ్లను రాష్ట్రవ్యాప్తంగా బుధవారం మంత్రులు, ఎమ్మెల్యేలు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కె.తారకరామారావు రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట పాఠశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.

సంబంధిత నియోజకవర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు మొదటి విడతలో పూర్తయిన పాఠశాలలను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించాలని ప్రభుత్వం ప్రజా ప్రతి నిధులను కోరింది. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ఊరు–మనబడి పథకాన్ని 3 దశల్లో చేపట్టాలని నిర్ణయించింది. పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయడం, కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా తీర్చిదిద్దడం దీని ముఖ్య ఉద్దేశం.

ఈ పథకానికి మొత్తంగా రూ.7,289 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశా రు. రాష్ట్రంలోని 26,055 స్కూళ్ల లో తొలి విడతలో 9,123 స్కూళ్లను ఎంపిక చేశారు. రూ.3,497.62 కోట్లను మొదటి విడతలో ఖర్చు చేయాలని నిర్ణయించారు. అయితే, ఇప్పటి వరకు 1,200 స్కూళ్లలో మాత్రమే పనులు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.

పాఠశాలల్లో భవనాలకు మరమ్మతులు చేపట్టడం, రంగులు వేయడం, కాంపౌండ్‌ వాల్స్‌ నిర్మించడం, విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం ఫర్నిచర్‌ అమర్చడం, డిజిటల్‌ తరగతులు, సోలార్‌ ప్యానెల్స్, అధునా తన వసతుల పాఠశాలలుగా తీర్చిదిద్దడానికి ప్రభు త్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. ఈ పథకం కింద పాఠశాలల్లో పరిశుభ్రమైన తాగునీరు, టాయిలెట్ల నిర్మాణం, అదనపు తరగతి గదులు, మంచి లైటింగ్‌ సదుపాయం, భోజనవసతి, గ్రీన్‌ బోర్డులు, డిజిటల్‌ తరగతులకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top