5న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ | Sakshi
Sakshi News home page

5న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

Published Wed, Feb 3 2021 2:54 AM

Krishna Board Three Member Committee Meets On 5th February - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండు రాష్ట్రాల్లో రబీ సాగునీటి అవసరాలు, వేసవిలో తాగునీటి అవసరాలపై చర్చించి లభ్యత ఆధారంగా ఇరు రాష్ట్రాలకు నీటిని కేటాయించాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 5వ తేదీన హైదరాబాద్‌లో బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే నేతృత్వంలో ఏపీ, తెలంగాణ ఈఎన్‌సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్‌ సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు మంగళవారం కృష్ణా బోర్డు చైర్మన్‌ ఎ.పరమేశం లేఖ రాశారు. కృష్ణా నదికి ఈ ఏడాది భారీ ఎత్తున వరదలు రావడంతో ఇరు రాష్ట్రాలు అవసరమైన మేర నీటిని వినియోగించుకోవాలని ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచించింది.

వరద ప్రవాహం తగ్గాక వాడుకున్న నీటి లెక్కలు తేల్చి, ఆ తర్వాత అవసరాలను బట్టి కేటాయిస్తామని పేర్కొంది. ప్రస్తుతం నీటి సంవత్సరం ప్రారంభంలోనే నీటి లెక్కలు తేల్చేందుకు బోర్డు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో గత నెల 31 వరకు వినియోగించుకున్న నీటి లెక్కలు, వచ్చే మార్చి 31 వరకు సాగు, తాగునీటి అవసరాలు చెప్పాలని ఇటీవల రాష్ట్రాల ఈఎన్‌సీలను బోర్డు కోరింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో నీటి లభ్యత, ఇరు రాష్ట్రాలు ఇప్పటిదాకా వినియోగించుకున్న నీరు ఆధారంగా మిగిలిన వాటా జలాలను కమిటీ కేటాయించనుంది.   

Advertisement
Advertisement