కోరుట్ల విద్యార్థుల రూపకల్పన
గ్యాస్‌టర్న్ డివైస్‌ను తయారు చేసిన కండ్లపల్లి విద్యార్థులు
కేంద్ర వికసిత్ భారత్ బిల్డథాన్‌కు రెండు ఎగ్జిబిట్ల ఎంపిక
కోరుట్లటౌన్/జగిత్యాలరూరల్: జగిత్యాల జిల్లా కోరుట్లలోని పీఎంశ్రీ జెడ్పీ పాఠశాల విద్యార్థులు, జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్లు కేంద్ర ప్రభుత్వ బిల్డథాన్‌కు ఎంపికయ్యాయి. ఫోల్డింగ్ ఎలక్ట్రిక్ సైకిల్‌ను ‘వోకల్ ఫర్ లోకల్’అనే అంశంపై ఆ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడు చందా నాగరాజు పర్యవేక్షణలో కోరుట్ల విద్యార్థులు ఎస్.మాని, కె.హారిక, డి.మధులిక, జి.రేవతి, జి.ప్రణీత్ తయారు చేశారు. ఈ సైకిల్ మడతపెట్టి తక్కువ స్థలంలోనే ఉంచే సౌకర్యం ఉంది.
తయారు చేసిన విధానం
నాలుగు ఫీట్ల పొడవున్న పాత సైకిల్, ఒక చిన్న బ్యాటరీ, ఒక విద్యుత్ మోటారు తీసుకున్నారు. సైకిల్‌ను 2 ఫీట్లకు రెండు భాగాలుగా వెల్డర్ సాయంతో కట్ చేయించారు. తలుపులకు వాడే ఇండెస్ పట్టీల సాయంతో ఫోల్డింగ్ అయ్యేలా అమర్చారు. బ్యాటరీకి మోటారు బిగించి సైకిల్ ముందు భాగంలో ఫిట్ చేసి.. నడిచేలా రూపొందించారు. దీనిని బస్సులోనూ తీసుకెళ్లవచ్చు. ఇంధన వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని విద్యార్థులు ప్రాజెక్ట్‌లో భాగంగా నమూనాను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయగా.. బిల్డథాన్‌కు ఎంపికైనట్టు సమాచారం వచ్చిందని జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, పాఠశాల హెచ్‌ఎం వడ్లకొండ గంగాధర్ తెలిపారు.

సేఫ్ హోమ్ ఎగ్జిట్ పేరిట..
కండ్లపల్లి మోడల్ స్కూల్‌కు చెందిన ఎండీ.యాసర్ అబాసి, సీహెచ్.మహత్, కే.దినేష్ కలిసి గైడ్ టీచర్ సి.శివకృష్ణ (పీజీటీ) పర్యవేక్షణలో సేఫ్ హోమ్ ఎగ్జిట్ పేరిట గ్యాస్ టర్న్ ఆఫ్ డివైస్ రూపొందించారు. ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు గ్యాస్ సిలిండర్‌ను ఆఫ్ చేయడం మరిచిపోయినా ఈ పరికరం సిగ్నల్ ఇస్తుంది. సిలిండర్ ఆఫ్ చేస్తేనే ఇంటి తలుపులు క్లోజ్ అవుతాయి. తద్వారా ప్రమాదాలను నివారించొచ్చు.


