సీబీఐ లేదా సిట్‌తో విచారణ జరిపించండి | Sakshi
Sakshi News home page

సీబీఐ లేదా సిట్‌తో విచారణ జరిపించండి

Published Fri, Nov 4 2022 2:14 AM

Kore Nandkumar Wife Chitralekha Petition On Telangana High Court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)తో దర్యాప్తు జరిపించాలని నిందితుడు కోరే నందుకుమార్‌ సతీమణి చిత్రలేఖ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘అక్టోబర్‌ 26న, మొయినాబాద్‌లోని రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో అవినీతి నిరోధక చట్ట ప్రకారం కేసు నమోదు చేసి నా భర్తతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 27న నిందితుల రిమాండ్‌ను పోలీసులు కోరగా, ఏసీబీ కోర్టు తిరస్కరించింది.

వెంటనే విడుదల చేయాలంది. 41ఏ కింద నోటీసులు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. దీనిపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా, కిందికోర్టు ఉత్తర్వులను కొట్టివేసింది. నిందితులు వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. అనంతరం పోలీసులు నిందితులను అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే కొన్ని ఆడియో టేపులను బయటికి లీక్‌ చేశారు. నందుకుమార్‌ ఫోన్‌ను ట్యాప్‌ చేసి వ్యక్తిగత సంభాషణలను రికార్డు చేశారు. ఇది టెలీగ్రాఫిక్‌ చట్ట నిబంధనలకు విరుద్ధం. రాష్ట్ర అధికార పార్టీ నేరుగా ప్రమేయం ఉన్న ఈ కేసులో పోలీస్‌ విచారణ సక్రమంగా సాగుతుందన్న నమ్మకం మాకు లేదు.

ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగా, కొందరు ఒత్తిడితో పెట్టిన కేసు మాత్రమే. టీఆర్‌ఎస్, బీజేపీ రాజకీయ యుద్ధంలో నా భర్త బలవుతున్నారు. ఈ నేపథ్యంలో కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతున్నా’అని పిటిషన్‌లో పేర్కొన్నారు. హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్‌ సీపీ, రాజేంద్రనగర్‌ ఏసీపీ, మొయినాబాద్‌ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్, కేంద్రం హోంశాఖ కార్యదర్శి, కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డిలను ప్రతివాదులుగా చేర్చారు.    

Advertisement
Advertisement