ఒక ప్రమాదం నాలుగు ప్రాణాలను బలి తీసుకోగా.. ఆ ఆవేదనతో కుటుంబంలోని మిగిలిన ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఖమ్మం జిల్లా మిట్టపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తల్లాడ మండలం మిట్టపల్లికి చెందిన గుత్తికొండ వినోద్-రేవతి దంపతులకు కవల పిల్లలు. గత ఏడాది ఏప్రిల్ 29వ తేదీన వాళ్ల ఇంట్లో గ్యాస్ సిలిండర్ ప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించి వినోద్ కవల పిల్లలు తరుణ్, వరుణ్‌తోపాటు.. వినోద్ నాయనమ్మ గుత్తికొండ సుశీల, మేనకోడలు మృతి చెందారు. ప్రాణంగా పెంచుకున్న ఇద్దరు కొడుకులు ఒకేసారి చనిపోవడంతో ఆ దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
డిప్రెషన్‌లోకి వెళ్లిన రేవతి గత నెలాఖరున ఆత్మహత్యకు యత్నించింది. ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఈ నెల 1న కన్నుమూసింది. అటు పిల్లలు, నాయనమ్మ, మేనకోడలితోపాటు భార్య మృతి చెందడంతో తాను మాత్రం ఎందుకు బతకాలని పలువురితో చెబుతూ రోదించిన వినోద్.. ఈనెల 7వ తేదీన వినోద్ ఇంట్లో ఉరి వేసుకున్నాడు. కాసేపటికి గుర్తించిన చుట్టుపక్కల వారు కొనఊపిరి ఉన్నట్లు గుర్తించి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.


