నేడు విచారణకు రావాలన్న సిట్.. స్పందించిన కేసీఆర్
జూబ్లీహిల్స్ ఏసీపీకి మాజీ సీఎం లేఖ
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉన్నా
కాబట్టి మీకు అనుకూలమైన మరో తేదీన విచారణ జరపండి
నిబంధనల మేరకు ఎర్రవల్లిలోని నా నివాసంలో విచారించండి
దర్యాప్తునకు తన పూర్తి సహకారం ఉంటుందని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్ర వారం విచారణకు హాజరుకావాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జారీ చేసిన నోటీసులపై మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు స్పందించారు. సిట్ విచారణకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అనేక మందికి అధికార పత్రాలు జారీ చేయడంలో నిమగ్నమైనందున సిట్‌కు అనుకూలమైన మరో తేదీన విచారణ జరపాలని కోరారు. మాజీ సీఎంగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా, బాధ్యతగల పౌరుడిగా దర్యాప్తునకు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ మేరకు సిట్ విచారణ అధికారిగా ఉన్న జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ పి.వెంకటగిరికి గురువారం ఆయన లేఖ రాశారు.
పార్టీ అధ్యక్షుడిగా బిజీగా ఉన్నా..
‘ఈ నెల 30న శుక్రవారం సిట్ ఎదుట విచారణకు రావాల్సిందిగా నన్ను కోరారు. కానీ ప్రస్తుతం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం చివరి తేదీ కావడంతో పార్టీ ప్రాతిపదికన జరుగుతున్న ఈ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడిగా అనేక మందికి అధికార పత్రాలు జారీ చేయడంలో నేను పూర్తిగా నిమగ్నమై ఉన్నా. కాబట్టి మీకు అనుకూలమైన మరో ఇతర తేదీలో అయినా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని నా నివాసంలో విచారణ నిర్వహించగలరు..’అని కేసీఆర్ ఆ లేఖలో పేర్కొన్నారు.
నిబంధనల మేరకు ఎర్రవల్లిలోనే..
‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 160లోని నిబంధనల ప్రకారం ç65 సంవత్సరాలకు పైబడిన పురుషుడు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావలసిన అవసరం లేదు. అటువంటి వ్యక్తిని అతడు నివసిస్తున్న స్థలంలోనే విచారణ చేయాలనే నిబంధనలున్నాయి. కాబట్టి ఎర్రవల్లిలోని నా నివాసంలో మీరు విచారణ నిర్వహించవచ్చు..’అని కేసీఆర్ తెలిపారు.
మున్సిపోల్స్‌పై దృష్టి పెట్టకుండా ఇబ్బంది పెట్టేందుకే..
– హరీశ్‌రావుతో సమావేశంలో కేసీఆర్
మున్సిపల్ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించకుండా బీఆర్‌ఎస్ అగ్ర నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టడం లక్ష్యంగానే రేవంత్ ప్రభుత్వం సిట్ విచారణను తెరమీదకు తెచ్చిందని కేసీఆర్ అభిప్రాయపడినట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసుల నేపథ్యంలో ఎర్రవల్లి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి హరీశ్‌రావు భేటీ అయ్యారు. రెండురోజుల క్రితం సిట్ విచారణకు హాజరైన మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలిసింది. సిరిసిల్ల పర్యటనలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కూడా ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నా కేసీఆర్ ఆదేశాల మేరకు హాజరుకాలేదు.
కాంగ్రెస్‌కు భయం పట్టుకుంది
‘పంచాయతీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ ఖంగుతింది. మున్సిపల్ ఎన్నికల్లోనూ తిరిగి అవే ఫలితాలు ఎదురవుతాయనే భయం పట్టుకుంది. కాంగ్రెస్ రెండేళ్ల పాలన వైఫల్యాలు, కుంభకోణాలతో ప్రజలు విసిగిపోయారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ అగ్ర నాయకత్వాన్ని కట్టడి చేసి కేడర్ మనో స్థైర్యం దెబ్బతీయడం ద్వారా మున్సిపల్ ఎన్నికల గండాన్ని దాటేందుకు కాంగ్రెస్ ఎత్తుగడలు వేస్తోంది. ఈ ప్రయత్నాలను వ్యూహాత్మకంగా ఎదుర్కొందాం. విచారణకు హాజరవడం ద్వారా ప్రభుత్వ కుట్రలను తిప్పి కొడదాం..’అని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాగా కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తూ మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు పలువురు నేతలు వేర్వేరు ప్రకటనలు జారీ చేశారు.


